నేడు కేసీఆర్ పొలంబాట.. రైతులతో ముఖాముఖి
కరువు పరిస్థితులతోపాటు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనంలోకి వస్తున్నారు. ముందుగా ఆయన రైతాంగాన్ని పలకరించబోతున్నారు. సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు ఆయన క్షేత్ర స్థాయి పర్యటనకు బయలుదేరారు. కరువు పరిస్థితులతోపాటు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. ఉదయం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరతారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేటకు వెళ్తారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు, రైతులతో మాట్లాడతారు.
మధ్యాహ్నం మీడియా సమావేశం..
మధ్యాహ్నం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని, అక్కడ భోజనం చేస్తారు కేసీఆర్. అనంతరం 3 గంటలకు మీడియా సమావేశం ఉంది. ఈరోజు పర్యటనలో ప్రత్యక్షంగా తాను చూసిన విషయాలపై ఆయన వివరించే అవకాశముంది. అదే సమయంలో తెలంగాణ తాజా రాజకీయ వ్యవహారాలపై కూడా కేసీఆర్ స్పందిస్తారని తెలుస్తోంది. అనంతరం మళ్లీ ఆయన పర్యటన కొనసాగుతుంది. మీడియా సమావేశం అనంతరం సూర్యాపేట నుంచి బయలుదేరి నల్లగొండ జిల్లా నిడమానూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి మాట్లాడతారు కేసీఆర్. సాయంత్రం 6 గంటలకు నిడమానూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు కు చేరుకుంటారు.