Telugu Global
Telangana

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన అదే రోజు!

ఆషాడం సెంటిమెంట్ దాటాలంటే ఆగస్టు రెండో వారం వరకు ఆగాల్సిందే. మరో పదిహేను రోజులు ఆగితే సెప్టెంబర్‌ వస్తుంది. ఈసారి కూడా సెప్టెంబర్‌ 6నే అభ్యర్థులను ప్రకటించాలనీ గులాబీ బాస్ అనుకుంటున్నారట.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన అదే రోజు!
X

ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలనుకున్న బీఆర్‌ఎస్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జూలై నెలలో 40మంది అభ్యర్థులను ప్రకటిస్తామన్న గులాబీ పార్టీ ఇప్పుడు ఆలోచనలో పడింది. కేసీఆర్‌ సెంటిమెంటే అందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఐదు నెలల స‌మ‌య‌మున్నా అధికార పార్టీ ఇప్పటి నుంచే అభ్యర్థులను ప్రక‌టిస్తూ వస్తోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టి వ‌స్తూ అక్కడికక్కడే సిట్టింగ్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. అయితే జూలై నెలలో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రతి నెల 40 సీట్ల ప్రక‌ట‌న ఉంటుంద‌ని పార్టీ నేత‌లకు ఇప్పటికే సంకేతాలు అందాయి. కానీ, ఈ నెలలో తొలి విడత అభ్యర్థుల ప్రకటనపై అధికార పార్టీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ఆషాడ‌మాసం కావ‌డంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. కానీ అభ్యర్థుల ప్రకటన వాయిదా వెనక అసలు కారణం వేరే ఉందట. గ‌తంలో ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత సెప్టెంబ‌ర్ 6న 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల‌ను ప్రక‌టించారు. ఆ ఎన్నిక‌ల్లో కేసీఆర్ 88 మంది ఎమ్మెల్యేల‌తో ఘ‌న విజ‌యం సాధించారు. అప్పుడు మంచి ఫ‌లితాలు రావ‌డంతో సెప్టెంబ‌ర్ 6 ను కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అందుకే ఈ ద‌ఫా సైతం సెప్టెంబ‌ర్ 6 న అభ్యర్థుల జాబితా విడుద‌ల చేసే అంశాన్ని కేసీఆర్ ప‌రిశీలిస్తున్నార‌ట‌.

ఆషాడం సెంటిమెంట్ దాటాలంటే ఆగస్టు రెండో వారం వరకు ఆగాల్సిందే. మరో పదిహేను రోజులు ఆగితే సెప్టెంబర్‌ వస్తుంది. ఈసారి కూడా సెప్టెంబర్‌ 6నే అభ్యర్థులను ప్రకటించాలనీ గులాబీ బాస్ అనుకుంటున్నారట. అందుకే అభ్యర్థుల జాబితా వాయిదా ప‌డిన‌ట్లు పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతుండటంతో, ఇప్పటి దాకా త‌మ‌కు టికెట్ ప‌క్కా అనుకుంటున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మాత్రం టెన్షన్‌ పెరుగుతోంది. ఈ నెల రోజుల్లో పరిస్థితులు మారితే ఎలా అనే ఆందోళన నేతలను వేధిస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ సెంటిమెంట్‌ను పక్కనబెట్టి తొలివిడత అభ్యర్థులను ప్రకటించాలని సిట్టింగ్‌లు కోరుకుంటున్నారు.

ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు సరైన ప్రణాళికను రూపొందించాకే గులాబీ బాస్‌ బరిలోకి దిగుతారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అభ్యర్థుల ప్రకటన జరిగిందంటే ఎన్నికల వేడి పీక్స్‌కి చేరుతుంది. అందుకే ప్రతిపక్షాలను బలంగా ఎదుర్కోగల వారికే ఈ సారి టికెట్లు ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నారట.

First Published:  11 July 2023 5:55 AM GMT
Next Story