Telugu Global
Telangana

నేడు కరీంనగర్ కదన భేరి.. కేసీఆర్ ప్రసంగంపై అందరిలో ఆసక్తి

కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను కేసీఆర్ బహిరంగంగా ఎండగట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ తోపాటు బీజేపీ వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముంది.

నేడు కరీంనగర్ కదన భేరి.. కేసీఆర్ ప్రసంగంపై అందరిలో ఆసక్తి
X

కరీంనగర్ వేదికగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమరశంఖం పూరించబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. "కరీంనగర్ కదనభేరి" అనే పేరుతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం 5.30గంటలకు ఈ మీటింగ్ మొదలవుతుంది. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కరీంనగర్ వేదికగా మొదలుపెట్టడం కేసీఆర్ కి ఆనవాయితీ. అందుకే ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వాన్ని కూడా కరీంనగర్ నుంచే మొదలుపెట్టబోతున్నారు. ఆ సెంటిమెంట్ కొనసాగించబోతున్నారు.


కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తి..

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వీటికి బీఆర్ఎస్ శ్రేణులనుంచి గట్టి సమాధానం వచ్చినా స్వయంగా కేసీఆర్ రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు ప్రజలు. మరి కాంగ్రెస్ విమర్శలకు కేసీఆర్ ఈ సభా వేదిక నుంచి ఎలాంటి సమాధానం చెబుతారనేది ఈరోజు తేలిపోతుంది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు మొదలయ్యాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కరువు పేరుతో సాగునీటి విడుదల కూడా సక్రమంగా జరగడంలేదు. ఈ సమస్యలన్నిటినీ కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విఫలమైందని పలుమార్లు పార్టీ అంతర్గత సమీక్షా సమావేశాల్లో చెప్పారు కేసీఆర్. ఆ వ్యతిరేకతను లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల రూపంలో మలచుకోవాలని నేతలకు సూచించారు. కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఆయన బహిరంగంగా ఎండగట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ తోపాటు బీజేపీ వ్యవహారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముంది. మేడిగడ్డతోపాటు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన అంశాలను కూడా ఆయన లేవనెత్తుతారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ఆయన చలో నల్లగొండ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకొచ్చారు. ఇప్పుడు కరీంనగర్ కదనభేరితో మరోసారి పార్టీ శ్రేణులను ఉత్తేజపరచబోతున్నారు.

First Published:  12 March 2024 9:36 AM IST
Next Story