బాబూ మోహన్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్.. నిజమేనా..?
ప్రజాశాంతి పార్టీ తరపున బాబూ మోహన్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని అంటున్నారాయన.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కి దూరమైన సందర్భంలో రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా శ్రీహరి కుమార్తె కావ్యకు కేసీఆర్ అవకాశమిచ్చారు. ఆ సీటు తనకు వద్దంటూ ఆమె లేఖ రాసి, తండ్రితో కలసి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ హాట్ సీట్ గా మారింది. బీఆర్ఎస్ తరపున వరంగల్ లో ఎవరిని పోటీకి నిలబెడుతున్నారనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఓ దశలో మాజీ మంత్రి రాజయ్య పేరు వినిపించింది. ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కడియం ఎలాగూ బయటకు వెళ్లారు కాబట్టి, ఇక రాజయ్యకు బీఆర్ఎస్ తో ఇబ్బంది లేదు. అందుకే ఆయనతో పార్టీ పెద్దలు మంతనాలు జరిపారని సమాచారం. మరోవైపు బాబూ మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ ని వీడిన బాబూ మోహన్ ప్రస్తుతం ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుగా ఉన్నారు. చివరకు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన ఆయన వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందంటూ ఆయన తాజాగా మీడియా ముందుకు రావడం విశేషం.
వాస్తవానికి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ లో పోటీ చేయడం కంటే.. బీఆర్ఎస్ టికెట్ దొరకడం బాబూమోహన్ అదృష్టమనే చెప్పాలి. అయితే బాబూ మోహన్ మాత్రం తనకు అలాంటి అవసరం లేదని, తాను ప్రజాశాంతి పార్టీ టికెట్ పైనే పోటీ చేస్తానన్నారు. తనను ఎవరూ డబ్బుతో కొనలేరని, మంత్రిగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపానంటున్నారాయన. బీఆర్ఎస్ ఆఫర్ వచ్చినా రాకపోయినా.. ఆయనకు మాత్రం మంచి పబ్లిసిటీ లభించింది.