బీజేపీ వ్యతిరేక పోరాటం...ఎల్లుండి బీహార్ సిఎం నితీష్ తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ ఈ నెల 31 న బీహార్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో భేటీ అయ్యి దేశ రాజకీయాలపై చర్చించనున్నారు.
దేశవ్యాప్తంగా బిజెపి కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మరోసారి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన పలు విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలను కలుసుకుని బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాట్లకు సన్నాహాలు ప్రారంభించారు. కొంత వ్యవధి తర్వాత మళ్ళీ ఆయన తన ప్రయత్నాలు ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎల్లుండి( బుధవారం 31న) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటి కానున్నారు. వీరిరువురు భవిష్యత్తు రాజకీయాలు, బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం.
లడఖ్‌లోని చైనాతో భారత సరిహద్దు వద్ద గాల్వాన్ లోయ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ నగదు సహాయాన్ని అందించనున్నారు.
ఈ నెల మొదటి వారంలో నితీష్ కుమార్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఆర్జెడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే నితీష్ తో కెసిఆర్ భేటీ కావాలనుకున్నారు. అయితే రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల వల్ల కలవలేకపోయారు. వరస సమావేశాలతో ఆయన బిజీగా ఉన్నారు.
సోమవారంనాడు పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ.. 2024లో వచ్చే ఎన్నికల్లో బిజెపి ముక్త్ భారత్ కు నాంది పలకాలని, మతం పేరుతో రక్తపాతానికి దారితీసే పరిస్థితులు కల్పిస్తున్న బిజెకి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.