Telugu Global
Telangana

నేడు మహారాష్ట్రకు కేసీఆర్.. రెండు రోజుల పర్యటన

పూర్తిగా రోడ్డు మార్గం నుంచే ఆయన ప్రయాణం సాగుతుంది. అడుగడుగునా కేసీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

నేడు మహారాష్ట్రకు కేసీఆర్.. రెండు రోజుల పర్యటన
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు మహారాష్ట్రకు బయలుదేరి వెళ్తారు. ఈరోజు, రేపు ఆయన అక్కడే ఉంటారు. ఈ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ కాన్వాయ్‌ తో ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గాన మహారాష్ట్ర పర్యటనకు వెళ్తారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకొంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్‌ కి వెళ్తారు. రాత్రి సోలాపూర్‌ లో బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్‌ నుంచి పండరీపురం చేరుకుంటారు సీఎం కేసీఆర్. విఠోభా రుక్మిణి మందిరంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

చేరికలు కూడా..

రెండు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో భారీగా చేరికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మంగళవారం సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో చేరికల సభ జరుగుతుంది. జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరతారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. పూర్తిగా రోడ్డు మార్గంలో ఈ యాత్ర సాగుతుంది.

ఇప్పటి వరకు రాజకీయ సభలు, శిక్షణా కార్యక్రమాలకోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు. ఇప్పుడు పూర్తిగా రోడ్డు మార్గం నుంచే ఆయన ప్రయాణం సాగుతుంది. అడుగడుగునా కేసీఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహారాష్ట్రలో ప్రతి గ్రామంలోనూ ఆయనకు స్వాగతం పలికేలా ఫ్లెక్సీలు కట్టారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో చెప్పేలా ఏర్పాట్లు జరిగాయి.

First Published:  26 Jun 2023 7:34 AM IST
Next Story