Telugu Global
Telangana

విచారణ అధికారిగా మీరే తప్పుకోండి.. కేసీఆర్ ఘాటు లేఖ

"హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన మీ తీరు.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు. అందుకే విచారణ బాధ్యతలనుంచి తప్పుకోండి.." అంటూ సూటిగా తన అభిప్రాయాన్ని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్.

విచారణ అధికారిగా మీరే తప్పుకోండి.. కేసీఆర్ ఘాటు లేఖ
X

గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విచారణ కమిషన్ నేరుగా కేసీఆర్ కి నోటీసులివ్వడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యుత్ లోటుతో సతమతం అవుతున్న రాష్ట్రానికి వెలుగులు తీసుకొచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ కి కమిషన్ నోటీసులెలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో నేరుగా కేసీఆర్ కూడా విచారణ కమిషన్ కి ఓ ఘాటు లేఖ రాయడం సంచలనంగా మారింది. విచారణ కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి ఆ బాధ్యతలనుంచి తప్పుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.


యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం, చత్తీస్ ఘడ్ రాష్ట్రంతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వివరణ కోరుతూ ఇటీవల జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి.. కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా 12 పేజీల ఘాటు లేఖను కమిషన్ కి పంపించారు కేసీఆర్. కమిషన్ చైర్మన్ గా నరసింహారెడ్డి తప్పుకోవాలన్నారు. ఆయన విచారణలో పక్షపాతం కనపడుతోందని చెప్పారు. తాను కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని అందుకే ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు కేసీఆర్.

కమిషన్ అడిగిన వివరాలన్నిటినీ తన లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు కేసీఆర్. తెలంగాణ కరెంటు కష్టాల్ని తీర్చేందుకే భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించాలని అనుకున్నట్టు తెలిపారు. దీనివల్ల మూలధన వ్యయంలో 400 కోట్ల రూపాయలు మిగిలాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భెల్‌కు యాదాద్రి, భద్రాద్రి పనులు నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చామన్నారు. భద్రాద్రి నిర్మాణంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన స్టే వల్ల, కరోనా వల్ల ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైందని, దాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు కేసీఆర్.

బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎలాగైనా తప్పుబట్టాలనే ఉద్దేశంతో కమిషన్ ఉందని చెప్పారు కేసీఆర్. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ ని నియమించిందని, దానికి తగ్గట్టే విచారణ లేకుండానే తప్పు జరిగిపోయినట్టు కమిషన్ తేల్చి చెప్పడం సరికాదన్నారు. "హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన మీ తీరు.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు. అందుకే విచారణ బాధ్యతలనుంచి తప్పుకోండి.." అంటూ సూటిగా తన అభిప్రాయాన్ని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్.

First Published:  16 Jun 2024 7:49 AM IST
Next Story