జాతీయ పార్టీల నేతలందర్నీ.. ఒంటిచేత్తో ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు
ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణకు వచ్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారానికి రెడీ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఏ మాత్రం తొణకడం లేదు.
తెలంగాణ ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణకు వచ్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారానికి రెడీ అంటున్నారు. కానీ తెలంగాణలో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఏ మాత్రం తొణకడం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ త్రయం జాతీయ పార్టీల అగ్రనేతలందరికీ ఒంటి చేత్తో సమాధానం చెబుతున్నారు.
సుడిగాలిలా చుట్టేస్తున్న కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలిలా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ బాణి వినిపించేందుకు రోజుకు మూడు, నాలుగు సభల్లో ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల విమర్శలను తన పదునైన ప్రసంగాలతో తిప్పికొడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి, మీ నియోజకవర్గ అభివృద్థికి నాది హామీ అంటూ ఓటర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అటు కేటీఆర్.. ఇటు హరీష్
మరోవైపు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ అధినేత అడుగుజాడల్లో రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. కాలనీ మీటింగ్‌ల నుంచి మొదలుపెట్టి సభలు, సమావేశాలు, రోడ్ షోలతో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల నేతలంతా రెక్కలు కట్టుకొచ్చి వాలిపోయినా అధినేతకు తోడు తామిద్దరం చాలన్నట్లు పొద్దున నుంచి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందని, దాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తే విజయం తమదేననే ధీమాతో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం పలు నియోజకవర్గాల్లో అలుపెరగని ప్రచారం చేస్తున్నారు.