క్యాన్సర్ పేషెంట్లకు 'కేసీఆర్ కిట్లు'.. రాష్ట్ర ప్రభుత్వ కొత్త కార్యక్రమం
క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న, ఆ రోగ లక్షణాలు ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడమే ఈ పథకం లక్ష్యం.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలను మెరుగు పరచడంతో పాటు వైద్య సిబ్బందిని కూడా పెంచుతోంది. ఆరోగ్యశ్రీని పకడ్బంధీగా అమలు చేస్తోంది. గర్భిణీ స్త్రీల విషయంలో పలు పథకాలు అమలులో ఉన్నాయి. బాలింతలకు 'కేసీఆర్ కిట్లు' అందిస్తోంది. అందులో అప్పుడే పుట్టిన పిల్లలకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ల కోసం కూడా ప్రత్యేక పథకాన్ని రూపొందించింది.
త్వరలో 'కేసీఆర్ క్యాన్సర్ కిట్లు' ఆ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న, ఆ రోగ లక్షణాలు ఉన్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడమే ఈ పథకం లక్ష్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని క్యాన్సర్ బాధితులను గుర్తించి వారి ఇంటి వద్దకే మందులను పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్లు సూచించిన మందులన్నింటికీ ఒక కిట్‌లో ఉంచి అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్ల వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల సంఖ్యను బట్టి ప్రభుత్వం మెడిసిన్స్ కోసం ఆర్డర్ పెట్టనున్నది.
క్యాన్సర్ సోకిన రోగులకు మూడు రకాలుగా చికిత్స చేస్తారు. కీమో థెరపీ, రేడియో థెరపీ, సర్జరీ ద్వారా రోగం నయం చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరికి ఒక విధానం సరిపోతుంది. కానీ, మరి కొందరికి రెండు, మూడు పద్దతులు కూడా ఉపయోగించారు. దీని తర్వాత ప్రతీ ఒక్కకరు కొన్నాళ్లు మందులు ఉపయోగించాలి. డాక్టర్లు సూచిస్తే సుదీర్ఘ కాలం కూడా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో పేదలు, సామాన్యలు కొనలేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో తప్ప ఇతర జిల్లా కేంద్రాలు, మండలాల్లో ఈ మెడిసిన్స్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెడిసిన్స్ కోసం ప్రతీ నెల నగరానికి రావడం తలకు మించిన భారం అవుతోంది. దీంతో కొందరు అసలు మెడిసిన్సే మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఈ విషయాలన్నీ గమనించిన ప్రభుత్వం కొత్తగా 'కేసీఆర్ క్యాన్సర్ కిట్లు' పథకానికి తెరలేపింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకున్న పేషెంట్లకు ఎంఎన్‌జే ఆసుపత్రిలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఇకపై ఈ పథకాన్ని జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. ఎంఎన్‌జేలో ఉన్న క్యాన్సర్ సెంటర్ నుంచే పేషెంట్ల ఇంటి వద్దకు కిట్లు చేరవేయనున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా సిద్దిపేట ప్రాంతంలో ఈ కిట్ల పంపిణీని ప్రారంభించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.