Telugu Global
Telangana

బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం.. చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు

మే-13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సరిగ్గా నెలరోజుల ముందు ఏప్రిల్ 13న చేవెళ్ల సభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఆ తర్వాత 15 లేదా 16 తేదీల్లో మెదక్‌లో సభ జరుగుతుంది.

బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం.. చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు
X

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు వెళ్లిపోతున్నా కేడర్ లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దానికి అనుగుణంగానే పార్టీ అధినేత కేసీఆర్ కూడా తన పర్యటనలతో వారిలో హుషారు తెప్పిస్తున్నారు, లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సర్వ సన్నద్ధం చేస్తున్నారు. ఎన్నికల వేళ బస్సుయాత్రకు సిద్ధమైన కేసీఆర్.. ఈనెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభతో లోక్ సభ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తారు.

ఇటీవల కేసీఆర్.. నల్గొండ, కరీంనగర్ పర్యటనలకు భారీ స్పందన వచ్చింది. రైతులు స్వచ్ఛందంగా ఆయన వద్దకు వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు. ఆయా సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ ఎక్కుపెట్టిన విమర్శలు కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. వీటికి కొనసాగింపుగా చేవెళ్ల బహిరంగ సభ నిలుస్తుందని అంటున్నారు. మే-13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సరిగ్గా నెలరోజుల ముందు ఏప్రిల్ 13న చేవెళ్ల సభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. ఆ తర్వాత 15 లేదా 16 తేదీల్లో మెదక్‌లో సభ జరుగుతుంది. ఈ సభలు పూర్తయ్యాక 17 లోక్‌సభ నియోజకవర్గాల గుండా కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా కూడా మీటింగ్ లు నిర్వహిస్తారు. దీనికోసం ఇన్ చార్జ్ లను కూడా ప్రకటించారు. అటు కేటీఆర్‌, హరీష్ రావు కూడా నియోజకవర్గ కేంద్రాలతో పాటు నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహిస్తారు. మొత్తమ్మీద లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.

First Published:  10 April 2024 1:44 AM GMT
Next Story