Telugu Global
Telangana

హైదరాబాద్ కి కేజ్రీవాల్.. నేడు కేసీఆర్ తో కీలక భేటీ

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయాలని చూస్తున్నారు కేజ్రీవాల్. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం దాడిని గట్టిగా ప్రతిఘటించాలంటున్నారు.

హైదరాబాద్ కి కేజ్రీవాల్.. నేడు కేసీఆర్ తో కీలక భేటీ
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు హైదరాబాద్ కి వస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కాబోతున్నారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్, ఈరోజు సీఎం కేసీఆర్ మద్దతు కోరేందుకు హైదరాబాద్ వస్తున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కేజ్రీవాల్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ తో సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత జరుగుతున్న ఈ భేటీలో కచ్చితంగా జాతీయ రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని తెలుస్తోంది.

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి సవరణలు చేస్తూ కేంద్రం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అధికార దాహంతో రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు సైతం బీజేపీ వెనకాడటం లేదని మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ విషయమై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ థాక్రేతో సమావేశమై బీజేపీకి వ్యతిరేకంగా మద్దతుకూడగట్టారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో కూడా కేజ్రీవాల్ భేటీ కావాల్సి ఉంది. ఈ దశలో ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవబోతుండటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ కు వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయాలని చూస్తున్నారు కేజ్రీవాల్. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం దాడిని గట్టిగా ప్రతిఘటించాలంటున్నారు. విపక్షాల ఐక్యతతో కేంద్రం వెనకడుగు వేస్తుందని ఆశిస్తున్నారు. ఇది ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, రేపు ఇతర రాష్ట్రాలపై కూడా కేంద్రం ఇలాగే పెత్తనం చేసేందుకు సిద్ధపడుతుందని చెబుతున్నారు కేజ్రీవాల్.

First Published:  27 May 2023 8:20 AM IST
Next Story