కెసిఆరే కరెక్ట్ ఆప్షన్! ఎందుకంటే..?
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ దూసుకపోయే సమయం ఆసన్నమైందా ? రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న పోరాటంలో ఒక్కొక్కరూ కాడి పడేస్తున్న నేపథ్యంలో మడమ తిప్పకుండా బీజేపీ పై పోరాడుతున్న కేసీఆర్ వైపు బీజేపీ వ్యతిరేక శక్తులు చూస్తున్నాయా ?
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ తర్వాత జాతీయ రాజకీయాలలో మరోసారి తెలుగు గడ్డ కీలకం కానుందా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 1989 ప్రాంతాల్లో ఎన్టీఆర్ దేశంలోని అన్ని విపక్షాలను ఏకం చేస్తూ 'నేషనల్ ఫ్రంట్' పేరిట జాతీయ స్థాయి వేదికను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగు రాష్ట్రం జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బిజేపియేతర రాష్ట్రాలలో ముఖ్యనాయకులతో, ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపారు. బిజెపి పై తీవ్రంగా పోరాటం చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే విధంగా ప్రయత్నాలు చేస్తూ కెసిఆర్ తో పాటు రాజకీయ కురువృద్ధుడైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నేతలతో కూడా చర్చలు జరిపారు. అయితే ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రబావం చూపలేకపోవడంతో ఆమె కాంగ్రెస్ లేని వేదికను కోరుకుంటూ ఆ పార్టీని తేలిగ్గా తీసుకుంటూ తానే వేదిక అధినేతగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే కెసిఆర్ మాత్రం బిజెపి విధానాలను వ్యతిరేకించే అన్ని పార్టీలను కలుపుకుని బలమైన ప్రత్యామ్నాయ వేదికను నిర్మించాలని భావిస్తున్నారు. కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాలు కొద్ది కాలం నెమ్మదించాయి. అయినా కేంద్రం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షపై తీవ్రంగా పోరాటం కొనసాగిస్తున్నారు.
ఇంతలో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని నిలపాలంటూ మమతా బెనర్జీ చాలా హడావిడి చేసి విపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఒకరకంగా తీవ్రంగా ప్రయత్నించి చివరికి యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. అభ్య ర్ధుల ప్రకటన తర్వాత ఆమె కాడి కిందపడేసి ద్రౌపది ముర్ముపేరును ప్రతిపాదిస్తున్నామని ఎన్డీయే ప్రకటిస్తే తాము ఈ ప్రయత్నాలు చేసేవారం కాదనట్టు మాట్లాడారు. అదే సమయంలో ప్రచారానికి సిన్హా తెలంగాణ కు వచ్చినప్పుడు రాష్ట్రపతే రాష్ట్రానికే వచ్చారా అన్న రీతిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనస్వాగతం పలికారు. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరెట్ అల్వాను విపక్షాల తరపున బరిలో నిలిపారు. ఎన్డీయే అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ను ప్రతిపాదించింది. ఈ విషయంలో కూడా కూడా మమత మళ్ళీ వెనకడుగు వేశారు. ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉంటామని టిఎంసి నిర్ణయించిందని ప్రకటించారు.
మమత వెనకడుగుకు కారణాలేంటి..?
అధికార దాహంతో రాష్ట్రాలను కబళిస్తున్న బిజెపి ప్రయత్నాలు దేశం యావత్తు గమనిస్తోంది. అందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సిబిఐ వంటి సంస్థలను ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతోన్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) ను ఓడించేందుకు బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అనేక విషయాల్లో గవర్నర్ ధనఖడ్ కు ముఖ్యమంత్రి మమతా కు నిత్యం సంఘర్షణే. ఇప్పుడు ఆయన్నే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో దించింది బిజెపి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మమతా బెనర్జీ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాలు వెనక ఆమె ఆలోచనలు ఏంటి..బిజెపి తమ ప్రభుత్వంపై మరింత కక్ష గడుతుందనా.. ఈడీ, సిబిఐ వంటి సంస్థల ద్వారా మరిన్ని చిక్కులు కలిగిస్తుందని భయపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె భయాలు నిజం అవుతున్నాయా అన్నట్టు ఆమె కేబినెట్ లోని మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహతుల ఇంటిపై ఈడి దాడి చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం, ఆయన అరెస్టు వంటి సంఘటనలు జరిగాయి. ఉపరాష్ట్రపతిగా ధనఖడ్ ఎన్నిక కూడా లాంఛనమే కాబట్టి ఇకపై బెంగాల్ రాష్ట్రంపై బిజెపి మరింత ఫోకస్ పెడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నట్టు కనబడుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనేది బిజెపి లక్ష్యమని తెలిసిందే. 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా బిజెపి కి వ్యతిరేకంగా పని చేసి భంగపడిన చందంగా మమత వ్యవహారం ఉందని వినిపిస్తున్నది.
అదీగాక అస్సోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, ధనఖడ్ తో మమతా బెనర్జీ భేటీ అయ్యారనేవార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాతనే ఆమె ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం గమనార్హం. టిఎంసీని సంప్రదించకుడా అల్వా పేరును ప్రకటించినందునే విపక్షాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పడం వెనక ఆమె భయాలు కనబడుతున్నాయంటున్నారు. ఎన్డీయే ను ప్రసన్నం చేసుకోవడానికి మమత ప్రయత్నాలు చేస్తున్నట్టుకనబడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైనా అధికార కాంక్షతో దూసుకుపోతున్న బిజెపి ఆమెను వదదిలిపెడుతుందనే నమ్మకాలేవీ లేదు. ఈ పరిస్థితుల్లో మమత విపక్షాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఆమె విపక్షాలను ఏకతాటిపైకిఎలా తీసుకురాగలుగుతారు.. ఇన్ని అనుమానాల మద్య విపక్షాలు ఆమెను విశ్వసించి దగ్గరవగలరా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ బిజెపి పై పోరాటం కొనసాగిస్తే అది సక్సెస్ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తకమానవు.
కేసిఆర్ బెస్ట్ ఆప్షన్ !
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తర్వాత నిక్కచ్చిగా బిజెపి పై పోరాటం చేస్తున్నది టిఆర్ ఎస్ పార్టీయే. ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీరు, బిజెపి విధానలపై చాలా బలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందుకు కలిసిరావాలని ఆయన మమత కంటే ముందుగానే విపక్ష పార్టీల నేతలందరితోనూ పలుదఫాలు చర్చించారు. ముందునుంచీ ఆయన ఒక పద్ధతి ప్రకారం ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఆయన వాదనతో మిగతా పార్టీలు కూడా ఏకీభవిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీలను అలా వదిలేస్తుందా.. లేక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చెబుతున్నట్టు ఈడి వంటి సంస్థలను ఆయనపై ప్రయోగిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఒకవేళ బిజెపి ఇందుకు సాహసిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నది మాత్రం వాస్తవం. ఉద్యమ పార్టీగా, తెలంగాణ జాతి పితగా భావించే కెసిఆర్ పై ఇటువంటి ప్రయోగాలు చేస్తే తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం ఉప్పెనలా విరుచుకుపడుతుందనేది క్షేత్ర స్థాయి పరిస్ఠితులు చెబుతున్నాయి. అదే జరిగితే అప్పట్లో ఎన్టీఆర్ జరిపిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంకంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ఉండక తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యం తెలంగాణ సెంటిమెంటుతో పాటు రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేతగా ఇంకా కెసిఆర్ ప్రజల మనసులో తిష్ఠ వేసుకునే ఉన్నారు. ప్రజా బలం ఉన్నంతవరకు ఎటువంటి కుట్రలు,కుయుక్తులు ఏ పార్టీపైనా పనిచేయవనేది సత్యం. అందువల్లనే కేసిఆర్ ధీటుగా బిజెపి పైకి అంత దూకుడుగా వెలుతున్నారు.
జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోవాలంటే మమతా బెనర్జీ వంటి వారికంటే ఎటువంటి శషభిషలు లేకుండా పోరాడుతున్న కెసిఆర్ లాంటి వ్యక్తే నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.