కేసీఆర్.. తెలంగాణ ముఖచిత్రంపై చెరగని సంతకం
రేవంత్ కు ఇష్టం లేకపోయినా అవి వెంటాడుతూనే ఉంటాయ్ : హరీశ్ రావు

తెలంగాణ ముఖచిత్రంపై కేసీఆర్ చెరగని సంతకమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా తాను గురుకులాల్లో చదివి ఎంబీబీఎస్ చేస్తున్నానని.. తానే తన తండా నుంచి ఎంబీబీఎస్ చదువుతోన్న మొదటి విద్యార్థిని అని సత్యజోతి ముఖ్యమంత్రికి వివరిస్తున్న వీడియోను బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ''గురుకులాల వల్ల ఎందరి జీవితాలు మారతాయో? మీరు మా మీద ఫేక్ కేసుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు అవే పైసలను ఈ పేద పిల్లల మీద పెట్టండి, కొంచెం పుణ్యం అయినా దక్కుతుంది..'' అని ఆయన చేసిన పోస్ట్ ను హరీశ్ రీ ట్వీట్ చేశారు. ''రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా అవి ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి.. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ ఆనవాళ్లు.. కళ్లు తెరిపించిన సంఘటన ఇది. ఓ గిరిజన తండా నుంచి తొలిసారి ఎంబీబీఎస్ సీట్ సాధించి డాక్టర్ కాబోతున్న సత్యజ్యోతి విజయం ఎలా సాధ్యమైంది? కేసీఆర్ గారు 250 గురుకులాలను 1020కి పెంచడం వల్ల.. మెడికల్ కాలేజీలను 5 నుంచి 33కి పెంచడం వల్ల.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేసినందువల్ల.. కేసీఆర్వ జ్ర సంకల్పం వల్లే సత్యజ్యోతిలాంటి ఎందరో బడుగువర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.. కేసీఆర్ గారి ఆనవాలు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు రేవంత్ రెడ్డీ.. అది తెలంగాణ ముఖచిత్రంపై ఆయన చేసిన చెరగని సంతకం! అర్థమైందా రేవంత్ రెడ్డి..'' అని ప్రశ్నించారు.