కేసీఆర్ గెలుపు ధీమా..
అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి పనులు ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల మరింత నమ్మకాన్ని పెంచాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంకేముంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని పగటి కలలు కంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ అధినాయకుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పెద్ద ఝలక్ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో కచ్చితంగా గెలుపొందబోతున్నామని సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు గెలుపురాగం వినిపించారు.
తద్వారా ప్రత్యర్థి పార్టీల్లో అపనమ్మకాన్ని, తమపార్టీ నాయకుల్లో విజయం పట్ల ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పారు. సరిగ్గా సమయం చూసి ప్రత్యర్థి పార్టీలను కచ్చితమైన లెక్కతో కొట్టారు. ఈ లెక్కలతోనే కాంగ్రెస్, బీజేపీల్లో ఎక్కడో విజయంపై ఉన్న చిన్న ఆశను కూడా కేసీఆర్ లేవనెత్తకుండా చేసేశారు. ఇదికదా.. నాయకుడి లక్షణం. దటీజ్ కేసీఆర్.
నిజమే.. అంత కచ్చితంగా కేసీఆర్ ఎలా చెప్పగలిగారు అంటే దానికి చాలా లెక్కలు కారణాలున్నాయి మరి. అధికారంలోకి వచ్చినప్పట్నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి పనులు ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల మరింత నమ్మకాన్ని పెంచాయి. వెయ్యినొక్క గురుకులాలు, జిల్లాకో వైద్య కళాశాల, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు, కొత్త సచివాలయం, వేగంగా పెరుగుతోన్న పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వరద, పడావు భూముల్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వంలో ఒక సరికొత్త తెలంగాణ ఆవిష్కరింపజేస్తోంది.
మరోవైపు రైతుబంధు, దళితబంధు, 3400 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పు, కల్యాణలక్ష్మీ, వృద్ధులకు పింఛన్లు, ఆరోగ్య శ్రీ, కంటివెలుగు వంటి సంక్షేమ పథకాలు సామాన్య ప్రజల్లో కేసీఆర్ అంటే ఒక నమ్మకాన్ని కలిగించాయి.
కేసీఆర్ అంటే తెలంగాణలో తమ ఇంటిపెద్దకొడుకుగా భావించే కుటుంబాలు కోకొల్లలు. ఇప్పుడు కేసీఆర్ ధీమా అదే. ఎక్కడికెళ్లినా ఎక్కడ చూసినా కేసీఆర్ దీక్షా దక్షుడు, దార్శనికుడు అన్న పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పార్టీ తరఫున చేయిస్తున్న అంతర్గత సర్వేలు కూడా ఇవే వాస్తవాల్ని నివేదికల రూపంలో ఇస్తుంటే గెలుపుపై ధీమా లేకుండా ఎలా ఉంటుంది మరి.
అందుకే వచ్చే ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అటు మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ విశేష ఆదరణ లభిస్తుండటం కేసీఆర్ గెలుపు నమ్మకానికి వేయిరెట్లు అదనపు బలం ఇచ్చినట్లైంది.