Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేయడానికి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ కార్య‌ద‌ర్శి బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సిట్ లో సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు హోం శాఖ కార్య‌ద‌ర్శి బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్ కు చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి , అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లను కొనుగోలు చేయడానికి బీజేపీ తరపున నలుగురు బ్రోకర్లు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి లు ప్రయత్నం చేస్తుండగా వల పన్ని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నలుగురు నిందితులు ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్న వీడియో ,ఢిల్లీకి చెందినపలువురు బీజేపీ నాయకులతో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో బహిర్గతమవడంతో ఈ అంశంపై బీజేపీ నాయకులు టీఆరెస్ పై ఆరోపణలకు దిగారు. ఈ కేసును ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్‌కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ దాఖలు చేశారు.

మరో వైపు హైకోర్టు నిందితులపై దర్యాప్తు సాగించవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులును రద్దు చేసి ఈ కేసుపై సత్వర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది.

దళారులపై మరో కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, సింహయాజీల‌పై మరో కేసు నమోదైంది. వీరిద్దరూ వేర్వేరు పేర్లతో ఆధార్‌, పాన్‌కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు పొందారని పైలెట్‌ రోహిత్‌ రెడ్డి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

First Published:  9 Nov 2022 8:34 PM IST
Next Story