బీఆర్ఎస్ ను విడిచిపెట్టాలనుకున్న వారికి కేసీఆర్ సలహా..
తెలంగాణలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణ ఉండబోదని చెప్పారు కేసీఆర్. బీజేపీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలున్నారా? అని ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల వేళ కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారు. కాంగ్రెస్ తో పోల్చి చూస్తే ఆపరేషన్ ఆకర్ష బీజేపీవైపు నుంచే కాస్త బలంగా పనిచేస్తోంది. అయితే ఇలా వెళ్తున్న వారందరికీ ఆయా పార్టీల్లో సముచిత స్థానం దక్కదని చెబుతున్నారు కేసీఆర్. దూరపు కొండలు నునుపు అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతలకు అక్కడ ఆదరణ దక్కదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అని.. బీఆర్‌ఎస్ బీఫారం ఇస్తే చాలు గెలుపు ఖాయమనే పరిస్థితి మళ్లీ వస్తుందని అన్నారు కేసీఆర్.
పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే 9మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు. మిగతా వారి విషయంలోకూడా త్వరలో నిర్ణయం తీసుకుని ప్రచార పర్వాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. సమీక్ష జరిగిన ప్రతిసారీ జంపింగ్ నేతల గురించి చర్చ వస్తోంది. అలాంటి వారి గురించి పట్టించుకోవద్దని చెబుతున్నారు కేసీఆర్. వెళ్లినవారంతా దూరపు కొండలు నునుపు అనే భ్రమలో ఉన్నారని అన్నారు. అలాంటి వారు తిరిగి వచ్చినా బీఆర్ఎస్ లో చేర్చుకోవద్దని కేసీఆర్ కు మిగతా నేతలు సూచించడం విశేషం.
బీజేపీకి ఆదరణ ఉండదు..
తెలంగాణలో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరణ ఉండబోదని చెప్పారు కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీని చూపించి ఏదో హడావిడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకలేదు కాబట్టే బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలు, ఇతర నేతలను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలగం లేదని.. అందుకే అరూరి రమేశ్ వంటి నేతలను చేరాలని అడుగుతున్నారని చెప్పారు కేసీఆర్. బీజేపీ తాజాగా ప్రకటించిన జాబితాలో ఒక్కరైనా ఆ పార్టీలో పుట్టి పెరిగిన నేతలున్నారా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్కువ రోజుల్లోనే ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు కేసీఆర్. క్షేత్రస్థాయిలో సాగునీరు, విద్యుత్, తాగునీటికి సమస్యలు నెలకొన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ సర్కారుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు కలసికట్టుగా పనిచేయాలని సూచించారు కేసీఆర్.