Telugu Global
Telangana

ఎగ్జిట్ పోల్స్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

రాజకీయం నిరంతర ప్రవాహం అని గుర్తు చేశారు. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదని, ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం అని అన్నారు కేసీఆర్.

ఎగ్జిట్ పోల్స్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కువశాతం ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్ శ్రేణుల్ని నిరాశలోకి నెట్టేశాయనే చెప్పాలి. ప్రామాణికంగా ఉంటుందని అనుకున్న ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్ ఫలితాలు మరీ దారుణంగా ఉంటాయని చెప్పింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలకోసం పనిచేసుకుంటూ పోవాలని చెప్పారు.


ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రస్తుతం ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయని అన్నారు కేసీఆర్‌. ఒక్కో సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నాయని విమర్శించారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాయి. గెలుపోటములు ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో పనిచేస్తూనే ఉండాలని చెప్పారు. ఎగ్జిట్‌ పోల్స్‌లో కొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు 11 స్థానాలు వస్తాయని చెప్పాయని, మరికొన్ని సంస్థలు ఒకే ఒక సీటు వస్తుందని తేల్చేశాయని అన్నారు కేసీఆర్. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదని, 3 సీట్లు వచ్చినా కుంగిపోయేది లేదని, రాజకీయ జయాపజయాలు మనకి లెక్కకాదని అన్నారు.

తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్.. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణకోసం అని అన్నారు. బీఆర్ఎస్ ఒక మహావృక్షం అని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నమాట వాస్తవమే అయినా, ఆ తర్వాత బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని ధీమాగా చెప్పారు కేసీఆర్. గత ఎన్నికల్లో కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని చెప్పిన ఆయన, రాజకీయం నిరంతర ప్రవాహం అని గుర్తు చేశారు. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదని, ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం అని అన్నారు కేసీఆర్.

First Published:  2 Jun 2024 10:28 AM GMT
Next Story