Telugu Global
Telangana

కేసీఆర్‌ దీక్షను చాటిచెప్పేలా దీక్షా దివస్‌

బసవతారకం హాస్పిటల్‌ నుంచి తెలంగాణ భవన్‌ కు పాదయాత్ర

కేసీఆర్‌ దీక్షను చాటిచెప్పేలా దీక్షా దివస్‌
X

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ చేపట్టిన దీక్షను చాటిచెప్పేలా శుక్రవారం దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. గురువారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు పద్మారావుగౌడ్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులతో కలిసి తెలంగాణ భవన్‌ లో దీక్షా దివస్‌ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు మోటార్‌ సైకిల్‌ ర్యాలీగా బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌ వరకు పాదయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణ భవన్‌ లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే కేసీఆర్‌ ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామన్నారు. అనంతరం నిర్వహించే సమావేశంలోని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు పాల్గొంటారని అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆరోజు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదని.. ఆయన గొప్పతనాన్ని భవిష్యత్‌ తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్, నాయకులు ఆనంద్ గౌడ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  28 Nov 2024 5:18 PM IST
Next Story