Telugu Global
Telangana

గ్యాసు, ట్రాషు.. తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఆల్రడీ ఉన్న పథకాలనే కొత్తగా చెబుతున్నారని, తెలంగాణ బడ్జెట్ పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా చేశారు కేసీఆర్.

గ్యాసు, ట్రాషు.. తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

వత్తి వత్తి చెప్పారు కానీ కొత్త విషయం ఏదీ తెలంగాణ బడ్జెట్ లో లేదని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొత్త సంక్షేమ పథకం ఒక్కటి కూడా ఇందులో లేదన్నారు. ఆల్రడీ ఉన్న పథకాలనే కొత్తగా చెబుతున్నారని, తెలంగాణ బడ్జెట్ పెద్ద గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. లక్షకోట్ల రుణాలు కూడా పాత పథకమేనని, వీరేదో కొత్తగా ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారన్నారు. కొత్త ప్రభుత్వానికి తాను 6 నెలలు గడువు ఇవ్వాలనుకున్నానని, అందుకే తాను అసెంబ్లీకి కూడా పెద్దగా రాలేదని గుర్తు చేశారు కేసీఆర్. తెలంగాణలో ఏ ఒక్క పాలసీని కూడా సరిగా రూపొందించలేదని చెప్పారు. ఇది అర్భక ప్రభుత్వం అని కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.


తమ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని, ఇప్పుడు అసలు పూర్తిగా రైతుబంధుని ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చిన సొమ్ముని తాము దుర్వినియోగంచేసినట్టు కాంగ్రెస్ చెబుతోందని, వారిది రైతు శత్రు ప్రభుత్వం అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు లేదని, విద్యుత్ సరఫరా లేదని.. రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని వంచించిందని, వృత్తికార్మికులను వంచించిందని అన్నారాయన. తెలంగాణ ఐటీ పాలసీ ఏంటి..? పారిశ్రామిక పాలసీ ఏంటి..? వ్యవసాయ పాలసీ ఏంటి..? ఆ వివరాలేవీ బడ్జెట్ లో లేవన్నారు కేసీఆర్.

గ్యాసు, ట్రాషు..

తెలంగాణ బడ్జెట్ అంతా గ్యాసు, ట్రాషు అని అన్నారు కేసీఆర్. వంచనను ఈస్ట్ మన్ కలర్ లో చూపించారన్నారు. ఇది పేదల బడ్జెట్ కాదని విమర్శించారు. భవిష్యత్ లో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరించారు. అది బడ్జెట్ ప్రసంగంలా లేదని, ప్లాట్ ఫామ్ స్పీచ్ లా ఉందన్నారు. రాజకీయ ప్రసంగం ఇచ్చారే కానీ, బడ్జెట్ పై మాట్లాడలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్.

First Published:  25 July 2024 8:52 AM GMT
Next Story