Telugu Global
Telangana

గుడ్లు పీకుతా, చెడ్డీ లాగుతా.. ఇదేనా అతని సంస్కారం

ఛోటే భాయ్‌కి ఓటు వేసినా.. బడే భాయ్‌కి ఓటు వేసినా ఒక్కటేనని.. ఛోటే భాయ్‌కి ఓటు వేస్తే.. పెద్దన్న మీటర్లు పెట్టుమంటున్నారని చెప్పి గ్యారెంటీగా మీటర్లు పెడతారని, రైతులు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేసీఆర్.

గుడ్లు పీకుతా, చెడ్డీ లాగుతా.. ఇదేనా అతని సంస్కారం
X

సీఎం రేవంత్ రెడ్డి భాషపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రాణాలు చావు నోట్లో పెట్టి తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని పదేళ్లు సుభిక్షంగా పాలించిన తనను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుడ్లు పీకుతా, ముడ్డి మీద ఉన్న చెడ్డీ లాగుతా.. అంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదన్నారు కేసీఆర్.

రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే తాము చూస్తూ ఉండబోమని చెప్పారు కేసీఆర్. తాను యుద్ధం చేస్తానని.. అందుకోసం మీరంతా సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు, పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి వంద నినాదాలు చెప్పారని, అవన్నీ కట్టు కథలు, పిట్ట కథలు తప్ప ఏవీ అమలు కాలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి జాతీయ హోదా కల్పించాలని కోరుతూ 100 ఉత్తరాలు రాస్తే ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు కేసీఆర్.


లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్ కి ఓటు వేస్తే అది బీఆర్ఎస్ కి పడినట్టేనని, మైనార్టీలు ఈ విషయంలో ఆలోచించాలని కోరారు. సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం గురుకులాలు, రంజాన్ కానుకలు, మసీదుల అభివృద్ధి, అందులో పని చేసే వారికి వేతనాలు చెల్లించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం గ్యారెంటీ అన్నారు కేసీఆర్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఛోటే భాయ్‌.. ప్రధాని మోదీ బడే భాయ్‌ అని ఎద్దేవా చేశారు. ఛోటే భాయ్‌కి ఓటు వేసినా.. నరేంద్ర మోదీకి ఓటు వేసినా ఒక్కటేనని.. ఛోటే భాయ్‌కి ఓటు వేస్తే.. పెద్దన్న మీటర్లు పెట్టుమంటున్నారని చెప్పి గ్యారెంటీగా మీటర్లు పెడతారని, రైతులు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేసీఆర్.

First Published:  26 April 2024 10:30 PM IST
Next Story