Telugu Global
Telangana

20 మంది ఎమ్మెల్యేలు రెడీ.. నేనే వద్దన్నా

ఇప్ప‌టివ‌ర‌కు 8 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని, మ‌రో మూడు స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

20 మంది ఎమ్మెల్యేలు రెడీ.. నేనే వద్దన్నా
X

బీఆర్ఎస్ ని మసి చేస్తాం, నుసి చేస్తాం, పునాదులతో సహా పెకలించి వేస్తామంటూ వీరంగం వేస్తున్న కాంగ్రెస్ నేతలకు షాకిచ్చారు కేసీఆర్. మా పార్టీని మసి చేయడం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మటాష్ చేసే అవకాశం వచ్చినా, తాను జాలి తలచి వదిలేశానన్నారు. కాంగ్రెస్ నేతల సవాళ్లకు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.

బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే అప్పట్లో కూల్చేందుకు బీజేపీ ప్రయ‌త్నించిందని, 64 మంది ఎమ్మెల్యేలున్న బలహీన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీజేపీని బ‌త‌క‌నిస్తుందా..? అని ప్రశ్నించారు. రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ అని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే అక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని వాళ్లు ఫీలవుతున్నారని అన్నారు కేసీఆర్.

కాంగ్రెస్ లోని ఓ కీలక నేత ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తానని తనను సంప్రదించారని, కానీ తానే ఇప్పుడొద్దని వారించానని చెప్పారు కేసీఆర్. రాష్ట్రంలో భ‌విష్య‌త్ బీఆర్ఎస్‌దేనని అన్నారాయన. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని, లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలుపు బీఆర్ఎస్ దేనని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు 8 లోక్‌స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని, మ‌రో మూడు స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయ గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు కేసీఆర్. ఏం జ‌రిగినా బీఆర్ఎస్‌కే మేలు జ‌రుగుతుందన్నారు. ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తారన్నారు. కొంద‌రు నేత‌లు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన బీఆర్ఎస్‌కు వచ్చిన న‌ష్టం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌లో టీమ్ వ‌ర్క్ లేదని, స్థిర‌త్వం లేదని.. దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకుందామని చెప్పారు కేసీఆర్.

First Published:  18 April 2024 12:49 PM GMT
Next Story