Telugu Global
Telangana

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని ప్రకటించిన‌ కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సంస్థ నిరర్దక సంస్థగామారిపోయిందని ఆయన ఆరోపించారు.

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నానని ప్రకటించిన‌ కేసీఆర్‌
X

నీతి ఆయోగ్ నిరర్దక సంస్థగామారిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. అందువల్ల రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ... ''నేను నా నిరసన ప్రధానమంత్రికి ఈ బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను'' అనిఅన్నారు.

గతంలో ఉన్న 'ప్లానింగ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' దేశానికి ఎంతో ఉపయోగపడిందన్నారు కేసీఆర్. అందులో రోజుల తరబడి చర్చలు జరిగేవని, ప్రతి ఒక్కరి వాదనలను వినేవాళ్ళని అనేక చర్చోపచర్చల తర్వాత నిర్ణయాలు జరిగేవని కేసీఆర్ తెలిపారు. ''ఎన్ డీ ఏ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తే అంతకన్నా గొప్పగా ఉంటుందని భావించాం.నీతిఆయోగ్ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తూ నిరక సంస్థగా మారింది.'' అని కేసీఆర్ మండిపడ్డారు.

ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశాలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయని. రాష్ట్రాలు చెప్పే మాటలు కనీసం వినరని, కేంద్రం చెప్పే మాటలు విని లేచి రావాలని కేసీఆర్ ఆరోపించారు. ఎన్ని పన్నులు విధించినా, ఎన్ని నిర్ణయాలు జరిగినా కనీసం నీతి ఆయోగ్ లో చర్చలు జరగవని కేసీఆర్ అన్నారు.

''ఆర్థిక వేత్తలు ఎంత చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీతి ఆయోగ్ రూపకల్పనలో ఎవరికీ ప్రమేయం ఉండదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యింది. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. పన్నుల వసూలులో రాజ్యాంగపరంగా ఉన్న‌ పద్దతులను పాటించడం లేదు. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14లక్షల కోట్ల నిధులను కొల్లగొట్టారు. నీతి ఆయోగ్ సమావేశం భజన మండలి సమావేశంగా మారింది.'' అని కేసీఆర్ ధ్వజమెత్తారు.

నీతి ఆయోగ్ చేసిన నిర్ణయాలను కూడా కేంద్రం అమలుపర్చకపోవడం దుర్మార్గమని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో సాగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలను పరిశీలించిన నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ పథకాలకు 24వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు.

''అనేక‌ రాష్ట్రాల నుంచి ఉపాధి హామీ కూలీలు డిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. దేశంలో సాగు నీరు లేదు, విద్యుత్ లేదు. దేశ రాజధానిలో కూడా తాగడానికి మంచి నీళ్లు లేవు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయి.

బీజేపీ 8ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగింది?'' అని కేసీఆర్ ప్రశ్నించారు.

కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలేనని, ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చిందని, కొత్త నిబంధనలతో తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు.

''సహకార సమాఖ్య విధానం పోయి ఆదేశిత సమాఖ్య విధానం వచ్చింది. 'మేము చెప్పింది చేయకపోతే మీ అంతు చూస్తాం' అనే పరిస్థితికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ప్రశంసలే తప్ప.. నిధులు రాలేదు. కేంద్ర , రాష్ట్ర ఉమ్మడి పథకాల్లో తెలంగాణ రూ.1.92 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి రూ.5వేల కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రానికి పంపించిన ప్రతిపాదనలన్నీ పక్కనపెట్టేశారు. జీఎస్టీ బకాయిలు కూడా చెల్లించకుండా పెండింగ్ లో ఉన్నాయి" అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

''నాలుగు నిమిషాలు మాట్లాడి నాలుగు గంటలు కూర్చొని రావడం కోసం ఆ సవేశానికి వెళ్ళడం అవసరమా ? అందులో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. కనీసం ఇలా నిరసన తెలిపేతేనన్నా దేశ ప్రజలందరికీ తెలుస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నాము.'' అని కేసీఆర్ అన్నారు.



First Published:  6 Aug 2022 5:07 PM IST
Next Story