Telugu Global
Telangana

రైతుల కోసం కేసీఆర్ సర్కారు చేస్తున్న సేవ గొప్పది : జగద్గురు పంచాచార్య స్వామీజీలు

తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. పదేండ్ల అనతి కాలంలోనే రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న సేవ చాలా గొప్పదని అన్నారు.

రైతుల కోసం కేసీఆర్ సర్కారు చేస్తున్న సేవ గొప్పది : జగద్గురు పంచాచార్య స్వామీజీలు
X

రైతుల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గొప్ప సేవ చేస్తోంది. రైతులతో పాటు సమస్త వృత్తి కులాలు, ప్రజలు తెలంగాణలో సుఖ శాంతులతో జీవిస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనిక పాలనతోనే సాధ్యమైందని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 ఏళ్లు పూర్తి చేసుకొని పదవ ఏట అడుగుపెట్టిన శుభవేళ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో పాల్గొనడానికి వీరశైవ పంచపీఠంలోని కాశీ, ఉజ్జయినీ, శ్రీశైల పీఠాల జగద్గురువులను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాశీకి చెందిన చంద్రశేఖర శివాచార్య మహాస్వామి, ఉజ్జయినికి చెందిన సిద్దలింగ శివాచార్య మహాస్వామి, శ్రీశైలంకు చెందిన చెన్నసిద్ద రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి శనివారం ప్రగతిభవన్‌ను సందర్శించారు. వారితో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు శివాచార్య మహాస్వాములు కూడా హజరయ్యారు. స్వామీజీలు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభను ఆశీర్వదించారు. సీఎం దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చి, పుణ్య వచనాలు పలికారు.

తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. పదేండ్ల అనతి కాలంలోనే రైతుల కోసం ప్రభుత్వం చేస్తున్న సేవ చాలా గొప్పదని అన్నారు. రైతుకు పుష్కలమైన సాగునీరు అందించడం చాలా గొప్ప విషయమని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచి, రైతులను కాపాడుతున్న సీఎం కేసీఆర్ పాలన దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని కొనియాడారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అనే నినాదంతో సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పాన్ని పూనారని.. దేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే దిశగా ఆయన తలపెట్టిన నయా భారత్ నిర్మాణానికి తమ వంతు సహకారం, ఆశీర్వాదాలు అన్ని సందర్భాల్లోనూ అందిస్తామని జగద్గురువులు తెలిపారు.

సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాధు పుంగవులను ఆదరించడం సీఎం కేసీఆర్‌కు ఉన్న గొప్ప మనసుకు తార్కాణం అని జగద్గురువులు ప్రశంసించారు. వేలాది మంది సాధువులను ఏకకాలంలో ఆహ్వానించి వారిని గౌరవించడం ఆనాడు కేవలం జనక మహారాజుకే సాధ్యమైంది. ఈనాటి వర్తమాన భారతంలో అలాంటి ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే మళ్లీ సాధ్యమైందని కొనియాడారు. సాధుసంతులను గౌరవించుకొని, ఆదరించే విషయంలో కేసీఆర్ కలియుగ జనకుడు అని అభినందించారు.

జగద్గురులు స్వయంగా ఆశీర్వదించడానికి రావడం తెలంగాణ ప్రజల భాగ్యం..

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలను ఆశీర్వదించడానికి జగద్గురువులు స్వయంగా రావడం రాష్ట్ర ప్రజల భాగ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ఎంతో నష్టపోయాయని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు దేశంలో రైతు సర్కార్ అవసరం చాలా ఉన్నది. నూతన భారత దేశాన్ని నిర్మించడానికి మీ సంపూర్ణ సహకారం కావాలని జగద్గురులను సీఎం కేసీఆర్ కోరారు.

సీఎం కేసీఆర్ దంపతులను వేద పండితులు, ఆచార్యులు మంత్రాలతో ఆశీర్వదించి, ఫల ప్రసాదాలను అందించారు. ప్రగతి భవన్‌కు వచ్చిన స్వామీజీలను సాంప్రదాయ పద్దతిలో సీఎం కేసీఆర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దంపతులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.

First Published:  3 Jun 2023 9:37 PM IST
Next Story