ఆరోగ్య తెలంగాణ.. ఇది కేసీఆర్ నమూనా
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు బడ్జెట్ లో కేటాయింపులు గణనీయంగా పెంచారు సీఎం కేసీఆర్. కొవిడ్ తర్వాత మరింత పగడ్బందీగా ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించుకుంటూ వచ్చారు.
తెలంగాణ వైద్యరంగం ఎంత పటిష్టంగా, ఎంత సమర్థంగా ఉందో కరోనా సమయంలో అందరికీ స్పష్టంగా తెలిసొచ్చింది. పట్టణాల్లోనే కాదు, పల్లెటూళ్లలో కూడా వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టింది. 2022ని ఆరోగ్య ఏడాదిగా మార్చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరిచేందుకు బడ్జెట్ లో కేటాయింపులు గణనీయంగా పెంచారు సీఎం కేసీఆర్. కొవిడ్ తర్వాత మరింత పగడ్బందీగా ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించుకుంటూ వచ్చారు. ఫోర్త్ వేవ్ వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కునే సత్తా తెలంగాణ వైద్య ఆరగ్య శాఖకు ఉంది. ఈ క్రమంలో అసలీ ఏడాది తెలంగాణ వైద్య రంగంలో వచ్చిన మార్పులు, నూతన ఆవిష్కరణలేంటో ఓసారి చూద్దాం.
కొవిడ్-19ని ఎదుర్కొనేందుకు సన్నద్ధత..
దేశంలో మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీ మొదలు పెట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ ఓ అడుగు ముందుకేసింది. ఆక్సిజన్ కొరత నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 324 టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. కొవిడ్ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలతో ఉన్న బెడ్లు 1,400 కాగా, ఇప్పుడవి 27,996 కి చేరుకున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆక్సిజన్ రవాణా, నిల్వ సామర్థ్యాన్ని విస్తరించింది. 16 ISO ట్యాంకర్లు, 24 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 200 MT లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు, 76 PSA ప్లాంట్లను కూడా స్థాపించింది.
బస్తీ దవాఖాన..
2018లో ప్రారంభమైన బస్తీ దవాఖాన నమూనా ఘన విజయం సాధించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. వైద్య సదుపాయాలు ప్రజల దరి చేరాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానల్లాగే 'పల్లె దవాఖాన'లను మొదలు పెట్టింది. బస్తీ దవాఖాన స్థానికంగా సేవలందించడంతో పెద్ద ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ కేర్ (ఓపీ) తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. 2019లో 12 లక్షల మంది రోగులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లగా, 2022లో బస్తీ దవాఖానాల వల్ల ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 5 లక్షల మంది రోగులు మాత్రమే ఔట్ పేషెంట్ సేవలకోసం ఉస్మానియాకు వెళ్లారు. 2019లో 6.5 లక్షల మంది రోగులు ఔట్ పేషెంట్ సేవల కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లగా, 2022లో కేవలం 3.7 లక్షల మంది రోగులు మాత్రమే వెళ్లారు. జనరల్ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య తగ్గిన తర్వాత ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సేవలు
సాధారణ వైద్య సేవలతోపాటు, ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. గడచిన ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల 3వేల కోట్ల రూపాయల విలువైన వైద్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఇతర ప్రాంతాల్లోని అన్ని అనుబంధ సూపర్ స్పెషాలిటీ బోధనాసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. 33 కొత్త మెడికల్ కాలేజీలు, 350 పడకల స్పెషాలిటీ టీచింగ్ ఆసుపత్రుల ఏర్పాటుకు కొనసాగుతున్న ప్రయత్నాలతో పాటు, సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టబడుతున్నాయి.
గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లు
గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్లు, బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు.. తెలంగాణ తల్లులకు గొప్ప ఉపశమనంగా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణులకు పౌష్టికాహార కిట్లు అందిస్తోంది ప్రభుత్వం. అధిక రక్తహీనత ప్రభావం ఉండే 9 జిల్లాల్లో బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లను 2022 డిసెంబర్ లో ప్రారంభించారు. బాలింతలకు అవసరమైన పౌష్టికాహార పదార్థాలు ఈ కిట్ లో ఉంటాయి. ఒక్కో ప్యాకేజీలో ఆల్బెండజోల్ టాబ్లెట్లు, ప్లాస్టిక్ కప్పు, ప్లాస్టిక్ బుట్ట, ఒక కిలో ఖర్జూరాలు, అర లీటరు నెయ్యి, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్, ఒక కిలో న్యూట్రిషన్ డ్రింక్ పౌడర్ ఉంటాయి.
యుక్త వయసు పిల్లల ఆరోగ్య కార్యక్రమం..
యుక్తవయస్సు బాలికల్లో రుతుస్రావ పరిశుభ్రతను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థినులకు శానిటరీ న్యాప్ కిన్ లను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.69.52 కోట్లు కేటాయించింది. రాబోయే ఆరు నెలల్లో మహిళా విద్యార్థులకు జిప్పర్ బ్యాగ్, శానిటరీ నాప్ కిన్ లు, వాటర్ బాటిళ్లతో కూడిన 11 లక్షల కౌమార ఆరోగ్య కిట్‌లు పంపిణీ చేస్తారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న బాలికలకు 22 లక్షల శానిటరీ నాప్ కిన్ కిట్ లు పంపిణీ చేస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా TIFFA స్కానింగ్ యంత్రాలు..
పుట్టబోయే బిడ్డ హృదయ స్పందనలనుంచి వారి పెరుగుదల వరకు సమగ్రంగా తెలియజేసే అత్యాధునిక TIFFA స్కానింగ్ యంత్రాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 44 ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. మొత్తం 56 TIFFA స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. 2022 నవంబర్ 26న పేట్ల బురుజులోని ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ స్కానింగ్ యంత్రాలను ప్రారంభించారు. ప్రైవేటు ల్యాబుల్లో ఈ స్కానింగ్ కోసం దాదాపు 3వేల రూపాయలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
వైద్య సిబ్బంది నియామకం..
'ఆరోగ్య తెలంగాణ'కు ప్రధాన ప్రోత్సాహకం వైద్య సిబ్బంది నియామకం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులతో పాటు తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వివిధ కేటగిరీల్లో 3,897 నూతన పోస్టుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ లోని తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలు, అటాచ్డ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఒక్కో కాలేజీకి 433 పోస్టులు కొత్తగా సృష్టించారు.
దేశంలోనే అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు..
కేంద్రం సహకారం అందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ సాధ్యమైంది. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం ద్వారా 6,690 MBBS సీట్లు రాష్ట్రానికి వచ్చాయి.