Telugu Global
Telangana

కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలతో రేవంత్‌ డబ్బా కొట్టుకుంటున్నడు

డిసెంబర్‌ 9 పోయింది.. మళ్లా డిసెంబర్‌ 9కి రుణమాఫీ చేస్తారట : మాజీ మంత్రి హరీశ్‌ రావు

కేసీఆర్‌ ఇచ్చిన ఉద్యోగాలతో రేవంత్‌ డబ్బా కొట్టుకుంటున్నడు
X

కేసీఆర్‌ నోటిఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు నిర్వహించి.. న్యాయ వివాదాలు పరిష్కరించిన ఉద్యోగాలకే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి డబ్బా కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆంథోల్‌ లో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌.. బలయ్‌ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే నిరుడు డిసెంబర్‌ 9నాడు రూ.2 లక్షల రుణమాషీ చేస్తామని హామీ ఇచ్చారని.. మధ్యలో ప్రంద్రాగస్టుకు మాఫీ చేస్తామని నమ్మించారని.. ఇప్పుడు రాబోయే డిసెంబర్‌ 9కి రుణమాఫీ అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారం కోసం ఎంతటి మోసపూరిత హామీలిచ్చిందో సీఎం, మంత్రుల మాటలే స్పష్టం చేస్తున్నాయన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుండేవి కావన్నారు. సంగారెడ్డిలో కలుషిత నీళ్లు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. తాము మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత నీళ్లు ఇస్తే ఈ ప్రభుత్వానికి అది కూడా చేతగావడం లేదన్నారు. రైతుబంధు లేదు, బతుకమ్మ చీరలు లేవు.. రుణమాఫీ లేదు.. ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. విజయ రామరాజు, అల్లం నవాజ్‌ రెడ్డి లాంటి ముఖ్య నాయకులు కోల్పోవడం బాధగా ఉందన్నారు. అలయ్‌.. బలయ్‌ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని నింపిందన్నారు. పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ట్రానిది అన్నారు. అన్ని కులాల బతుకమ్మ సద్ది పంచుకోవడం.. జమ్మి పంచుకొని అలయ్‌ బలయ్‌ తీసుకోవడం ఎంతో గొప్పవన్నారు.

రాబోయే పోరాటానికి హరీశ్‌ సాయుధ పూజ చేసిండు : రసమయి బాలకిషన్‌

అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు చేసింది జమ్మి పూజ మాత్రమే కాదు.. రాబోయే పోరాటానికి సాయుధ పూజ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్‌ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం నిదర్శనమని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. పదేళ్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసీఆర్ పాలించారని, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీ ఎంఎస్ చైర్మన్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

First Published:  14 Oct 2024 3:20 PM IST
Next Story