Telugu Global
Telangana

ఆర్థిక రాజధానిలో తాగునీటి కరువు.. ఈ పాపం ఎవరిది..?

ఒక‌ కులం, మ‌తం, వ‌ర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భ‌వించ‌లేదని, దేశంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు బీఆర్ఎస్ ఏర్ప‌డిందని చెప్పారు కేసీఆర్. మార్పు వ‌చ్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు.

ఆర్థిక రాజధానిలో తాగునీటి కరువు.. ఈ పాపం ఎవరిది..?
X

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై, మహారాష్ట్రలోని బీజేపీ కూటమిపై విమర్శలు ఎక్కు పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ ఆర్థిక రాజధాని అని పేరున్న ముంబైలో కనీసం తాగునీటికి కూడా ప్రజలు అల్లాడిపోతున్నారని, ఇదెక్కడి ఘోరం అని అన్నారు. గోదావ‌రి, కృష్ణా, పెన్ గంగా వంటి న‌దులు ఉన్నా మ‌హారాష్ట్ర‌కు నీటి క‌ష్టాలెందుకని ప్రశ్నించారు. దేశం పురోగ‌మిస్తుందో, తిరోగ‌మిస్తుందో.. ప్రజలు ఆలోచించాలన్నారు. మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఐదేళ్లలోనే ప్రతి ఇంటికీ సుర‌క్షిత తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు తాగేనీటినే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గోండు ప్ర‌జ‌లు కూడా తాగుతున్నారని చెప్పారు. ఇక్క‌డ కూడా ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతామని, ప్ర‌తి ఎక‌రాకు సాగునీరు అందిస్తామన్నారు.


మేకిన్ ఇండియా అంటున్నా న‌గ‌రాల్లో వీధి వీధికో చైనా బ‌జార్ ఉందని.. మోదీ హయాంలో డిజిట‌ల్ ఇండియా మ‌జాక్ అయిందని, మేకిన్ ఇండియా పెద్ద జోక్ అయిందని ఎద్దేవా చేశారు కేసీఆర్. మ‌హారాష్ట్ర‌లో మంత్రులకు కేబినెట్ ఉంటుంది కానీ, రాష్ట్రానికి చీఫ్ సెక్ర‌ట‌రీ ఎందుకు ఉండ‌రని ప్రశ్నించారు. తెలంగాణ లాంటి మోడ‌ల్ మ‌హారాష్ట్ర‌లో తీసుకొస్తే తాను ఇక్కడిదాకా రావాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. మ‌హారాష్ట్ర‌లో ద‌ళిత‌బంధు, రైతుబంధు అమ‌లు చేయాలన్నారు. 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చి, రైతుబంధు, రైతుబీమా క‌ల్పిస్తే తాను మ‌హారాష్ట్ర‌కు రానే రాను అన్నారు. అంబేద్క‌ర్ జ‌న్మించిన నేల‌పై ద‌ళితుల‌ను ప‌ట్టించుకోరా..? ద‌ళిత‌బంధు లాంటి ప‌థ‌కం మ‌హారాష్ట్ర‌లో ఎందుకు అమ‌లు చేయ‌రు అని ప్రశ్నించారు కేసీఆర్.

ఒక‌ కులం, మ‌తం, వ‌ర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భ‌వించ‌లేదని, దేశంలో మార్పు తీసుకువ‌చ్చేందుకు బీఆర్ఎస్ ఏర్ప‌డిందని చెప్పారు కేసీఆర్. మార్పు వ‌చ్చే వ‌ర‌కు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్నారు. అన్ని వ‌ర్గాల వారికి స‌రైన న్యాయం ద‌క్కాల్సిందేనన్నారు కేసీఆర్. మార్పు రాకపోతే దేశం ముందుకు వెళ్ల‌దని, మార్పు తీసుకు వ‌చ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని చెప్పారు. ఒక పార్టీ గెలిస్తే.. మ‌రో పార్టీ ఓడిపోవ‌డం ప‌రివ‌ర్త‌న కాదని, ఎవ‌రు గెలిచినా స‌మ‌స్య అప‌రిష్కృతంగానే ఉంటే అది పరివర్తన ఎలా అవుతుందన్నారు కేసీఆర్. పార్టీలు గెల‌వ‌డం ముఖ్యం కాదని, ప్ర‌జ‌ల ఆకాంక్ష గెల‌వ‌డం ముఖ్యమన్నారు. దేశ భ‌విష్య‌త్ యువ‌త‌పై ఆధార‌ప‌డి ఉందని, వారు ఎంత త్వ‌ర‌గా మేల్కొంటే అంత త‌ర్వ‌గా బాగుప‌డుతామన్నారు కేసీఆర్.

First Published:  24 April 2023 9:59 PM IST
Next Story