Telugu Global
Telangana

అప్పుడు వద్దన్నాం, ఇప్పుడు విలీనం చేశాం.. ఎందుకంటే?

"ఆర్టీసీని తీసివేద్దామంటే.. తీసివేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్‌ స్కిల్‌ ఉన్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌ ఫ్రీ ఉండే సంస్థ, ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే సంస్థ. మనమే విద్యార్థులకు లక్షల్లో పాసులు జారీ చేస్తున్నాం. ప్రజలు సైతం బస్సులు ఉండాలని కోరుకుంటారు. ఆర్టీసీ సంస్థ మనుగడ సాధించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే సాకాలి." అని చెప్పారు సీఎం కేసీఆర్.

అప్పుడు వద్దన్నాం, ఇప్పుడు విలీనం చేశాం.. ఎందుకంటే?
X

ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. గతంలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ విలీనాన్ని వద్దన్నారు, ఇప్పుడు ఆయనే విలీనం కావాలంటున్నారని పాతవీడియోలను వైరల్ చేశారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. వారందరికీ అసెంబ్లీ వేదికగా సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్. అప్పుడు ఎందుకు వద్దన్నాం, ఇప్పుడెందుకు విలీనం చేశామనే విషయాలను వివరించారు.


ఆర్టీసీ విలీనం వద్దన్నవాళ్లే ఎలా తీసుకుంటారని మాట్లాడే పిచ్చోళ్లు సైతం బయట ఉన్నారని, వారితో సంబంధం పెట్టుకోలేదని, ఏ పని చేసినా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని, లోతైన దృక్పథం, పరిశీలనతోనే విలీనం చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఆర్టీసీకి ఏడాదికి రూ.1500కోట్లు ఇస్తున్నామని, ప్రభుత్వ సంస్థ కాకపోయినా సాకేది ప్రభుత్వమే అని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్నదని ఆర్టీసీని రద్దు చేయలేం, ప్రజలకు ప్రజా రవాణాను దూరం చేయలేం. పైగా కార్మికులకు భద్రత కూడా వస్తుందనే ఉద్దేశంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు కేసీఆర్.

ఉమ్మడి ఏపీలో తాను రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భాన్ని కూడా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఏపీఎస్‌ఆర్టీసీ రూ.14కోట్ల నష్టాల్లో ఉండేదని, ఆ నష్టాన్ని పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు ప్రవేశపెట్టి రూ.14కోట్ల ఆదాయంలోకి తీసుకువచ్చామని చెప్పారు. శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాలను పూడ్చవచ్చని, కానీ ఇటీవల డీజిల్‌ ధర భారీగా పెరిగిందని, ఆర్టీసీని నష్టాల్లోనుంచి పైకి తేవడం అసాధ్యమని, అందుకే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని అన్నారు కేసీఆర్. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా సోషల్‌ ఆబ్లిగేషన్ అని, అందుకే విలీనంపై ముందడుగు వేశామన్నారు.


"ఆర్టీసీని తీసివేద్దామంటే.. తీసివేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్‌ స్కిల్‌ ఉన్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌ ఫ్రీ ఉండే సంస్థ, ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే సంస్థ. మనమే విద్యార్థులకు లక్షల్లో పాసులు జారీ చేస్తున్నాం. ప్రజలు సైతం బస్సులు ఉండాలని కోరుకుంటారు. ఆర్టీసీ సంస్థ మనుగడ సాధించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే సాకాలి." అని చెప్పారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి విలీనం చేస్తున్నారనే ఆరోపణలు కొట్టిపారేశారు కేసీఆర్. చిల్లర మాటలను పట్టించుకోబోమన్నారు.

First Published:  6 Aug 2023 8:01 PM IST
Next Story