Telugu Global
Telangana

గుజరాత్, హిమాచల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని టీఆరెస్ అధ్యక్షులు , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దేశంలో బీజేపీ చేస్తున్న అప్రజాస్వామిక కార్యకలాపాలను అక్కడి ప్రజలకు వివరించడమే ప్రధాన ఎజెండాగా కేసీఆర్ తన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

గుజరాత్, హిమాచల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం
X

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అస్థిరపరిచేందుకు, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు.

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఆయన తన దేశవ్యాప్త‌ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేటాడి తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ముఖ్యమంత్రి బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితులను అరెస్టు చేయగా, బిజెపి డర్టీ రాజకీయాలు, దాని కుట్రపూరిత కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా తీర్పును కోరాలని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని టీఆరెస్ వర్గాలు తెలిపాయి.

50-60 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కూడిన బృందానికి తాను నాయకత్వం వహించి తెలంగాణ నుంచి గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్ ల్లో ప్రచారం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తెలంగాణ నుంచి వెళ్ళే ప్రజా ప్రతినిధులు అక్కడ స్థానిక‌ ప్రజలకు చేరువవడం, బీజేపీ కుట్రల గురించి వివరాలను వారికి తెలియజేయడం ముఖ్యకార్యక్రమంగా ఉంటుంది. . అంతే కాక టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ఏజెంట్లు చేసిన కుట్ర‌ వీడియో ఫుటేజీని గుజరాతీతో సహా స్థానిక భాషల్లోకి అనువదించి, స్థానిక ప్రజల అవగాహన కోసం ప్రసారం చేస్తారు.

గత ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రజా ప్రతినిధులు గుజరాత్, హిమాచల్ ప్రజలకు వివరిస్తారు. ఈ మేరకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

First Published:  5 Nov 2022 8:32 AM IST
Next Story