ముస్తఫా ముస్తఫా.. డోండ్‌వర్రీ ముస్తఫా అంటున్న కేసీఆర్
సిద్ధాంతపరంగా రాజకీయాల్లో కొందరితో వ్యతిరేకించినా తనతో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తున్న నేతలను మాత్రం ఇప్పటికీ స్నేహభావంతోనే చూస్తారు.
ముస్తఫా ముస్తఫా.. డోంట్ వర్రీ ముస్తఫా.. పాతికేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్టయిన ప్రేమదేశంలో స్నేహం విలువను చెప్పే పాట ఇది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన పాత స్నేహితులకు ఈ పాటలోని సారాంశాన్ని విడమర్చిచెబుతున్నారు. సిద్ధాంతపరంగా రాజకీయాల్లో కొందరితో వ్యతిరేకించినా తనతో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తున్న నేతలను మాత్రం ఇప్పటికీ స్నేహభావంతోనే చూస్తారు. రాజకీయ జీవితం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో తనతో కలిసి పని చేసిన నేతలను పార్టీలోకి పిలిచి తగిన విధంగా గౌరవం కల్పిస్తున్నారు. తాజా అభ్యర్థుల జాబితాలోనూ ఆ ముద్ర స్పష్టంగా కనపడింది.
సిటింగ్ ఎమ్మెల్యేను కాదని మరీ కడియం శ్రీహరికి టికెట్
మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరితో టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్‌కు స్నేహం ఉంది. అందుకే బీఆర్ఎస్‌లోకి వచ్చాక ఆయనకు మంచి ప్రాధాన్యమిస్తూనే వస్తున్నారు. ఎమ్మెల్సీని చేసి తగిన గౌరవం ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్ ఘన్‌పూర్‌లో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నాక సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదనుకున్నాక ఆయన ఏ ఆలోచనా లేకుండా కడియంకే టికెట్ ఇచ్చేశారు.
కంటోన్మెంట్‌లో సాయన్న కూతురికి సాయం
మరోవైపు కంటోన్మెంట్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ఇటీవలే దివంగతులైన సాయన్నతోనూ కేసీఆర్‌కు స్నేహ సంబంధాలున్నాయి. నాలుగుసార్లు టీడీపీ నుంచి గెలిచిన సాయన్న 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానించారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఇచ్చారు. ఇటీవల ఆయన చనిపోయాక ఆ స్థానంలో బీఆర్ఎస్ యువనేత క్రిశాంక్‌కు టికెట్ ఇవ్వాలని ఒత్తిళ్లు వచ్చినా.. వెనక్కి తగ్గలేదు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా ఉన్న సాయన్న కుమార్తె లాస్యనందితకే సాయన్న వారసురాలిగా టికెట్ కట్టబెట్టారు. స్నేహధర్మాన్నినిలబెట్టుకున్నారు. గతంలో తనతోపాటు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే టికెట్ మరోసారి ఇచ్చారు.
తుమ్మలకు మాత్రం నో ఛాన్స్
అయితే ఖమ్మం జిల్లాలో సీనియర్ నేత, కేసీఆర్‌తో ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాత్రం బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. పాలేరులో ఆయనకు టికెట్ దక్కదని ముందు నుంచీ సంకేతాలు వెలువడుతూనే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మలపై గెలిచి తర్వాత కారెక్కిన కందాళ ఉపేందర్‌రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. దీంతో తుమ్మల వేరే పార్టీల వైపు చూశారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఆయనకు టికెట్ ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
*