BRS నుంచి రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు.. ఎందుకంటే..?
ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాలు ఖమ్మం జిల్లా వారికే దక్కనున్నాయి. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు ఖమ్మం జిల్లాకు చెందిన వారే..
రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును ఫైనల్ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఇవాల్టితో నామినేషన్ గడువు ముగియనుంది. సీనియర్ నేతలతో చర్చించిన కేసీఆర్.. వద్దిరాజు అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేశారు. ఇవాళ వద్దిరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఏడుగురు సభ్యులకు ప్రాతినిథ్యం ఉండగా.. వీరంతా బీఆర్ఎస్ వారే కావడం విశేషం. ఈ ఏడుగురిలో వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్‌కు ఒక్క స్థానం సునాయాసంగా దక్కనున్నాయి.
ఇక వద్దిరాజు వరుసగా రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వద్దిరాజు.. తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2022లో బీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో వద్దిరాజును రాజ్యసభకు పంపింది బీఆర్ఎస్ దాదాపు. వద్దిరాజుకు గాయత్రీ రవిగా గుర్తింపు ఉంది. గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు ఆయనే. ప్రస్తుతం చీఫ్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో గ్రానైట్ క్వారీ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వద్దిరాజు మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు సమీప బంధువు.
ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాలు ఖమ్మం జిల్లా వారికే దక్కనున్నాయి. బీఆర్ఎస్ తరపున వద్దిరాజు ఖమ్మం జిల్లాకు చెందిన వారే కాగా.. కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా ఖరారైన రేణుకా చౌదరిది ఖమ్మం జిల్లానే. ఇక మరో స్థానానికి కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది కాంగ్రెస్.