Telugu Global
Telangana

ఆడపిల్లలకు స్కూటీలు లేవు కానీ, హైదరాబాద్ లో లూటీలు షురూ

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదని, ఉన్న వనరులను వాడుకునే తెలివి లేదని విమర్శించారు కేసీఆర్. పదేళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్నీ మళ్లీ కనబడుతున్నాయని అన్నారు.

ఆడపిల్లలకు స్కూటీలు లేవు కానీ, హైదరాబాద్ లో లూటీలు షురూ
X

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు కేసీఆర్. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీసే అంకుశం మనకు కావాలని చెప్పారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే అన్ని లోక్ సభ సీట్లు బీఆర్ఎస్ గెలవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే, తాము ఏం చేయకపోయినా సరే ప్రజలు గెలిపించారనే ధీమా వారికి వస్తుందని, బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరతాయని చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, తన ముందే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే బాధనిపిస్తోందని అన్నారు కేసీఆర్. తాను బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడతానన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల వెంటనే ఉంటుందని చెప్పారు.


చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయని, కరెంటు, సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అంతులేని హామీలు, ప్రలోభాలతో కిందమీద చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, అయితే.. 4 నెలల్లోనే వారికి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని చెప్పారు కేసీఆర్. వారికి ఓ పాలసీ లేదని, ఉన్న వనరులను వాడుకునే తెలివి లేదని విమర్శించారు. పదేళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్నీ మళ్లీ కనబడుతున్నాయని అన్నారు కేసీఆర్.

బీజేపీ వల్ల తెలంగాణకు కనీసం ఒక్క నవోదయ స్కూల్ కూడా రాలేదని విమర్శించారు కేసీఆర్. "అయితే మోడీ లేదంటే ఈడీ... ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం" అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయడం వృథా అని చెప్పారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ గతంలో తన మెడపై కత్తి పెట్టారని గుర్తు చేశారు కేసీఆర్. కానీ రైతాంగాన్ని కాపాడుకునేందుకు తన ప్రాణం పోయిన సరే మీటర్లు పెట్టనని చెప్పానన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే మళ్లీ రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయన్నారు. మీటర్లు వద్దంటే బీజేపీని గుద్దుడు గుద్దాలని, నేలకేసి కొట్టాలని, అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్లు వారికి అర్థమవుతుందని చెప్పారు. మత్తులో పడి మతంలో పడి పిచ్చిలో ఓటు వేస్తే మనం కూడా పిచ్చి లేసి పోతామని హెచ్చరించారు. బలహీన వర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అని, ఆయనకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్.

First Published:  14 April 2024 2:43 AM GMT
Next Story