Telugu Global
Telangana

Superstar Krishna: వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయా.. మహేశ్‌ను ఓదార్చిన సీఎం కేసీఆర్

ప్రముఖ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎంపీగా కూడా రాజకీయాల్లో రాణించారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్య క్రియలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Superstar Krishna: వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయా.. మహేశ్‌ను ఓదార్చిన సీఎం కేసీఆర్
X

తెలుగు చిత్ర రంగం గొప్ప నటుడిని కోల్పోయిందని, వ్యక్తిగతంగా తాను ఓ మంచి మిత్రుడిని కోల్పోయానని సీఎం కేసీఆర్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. నానాక్‌రాంగూడ లోని నివాసంలో ఉంచిన కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న సినీ నటుడు మహేశ్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ సంతోశ్ కూడా ఉన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..

ప్రముఖ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఎంపీగా కూడా రాజకీయాల్లో రాణించారని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆయన చాలా ముక్కు సూటిగా మాట్లాడే మనిషని, అల్లూరి సీతారామరాజు సినిమాను తాను చాలా సార్లు చూశారని అన్నారు. ఈ దు:ఖాన్ని భరించగల ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు.

అంతకు ముందు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా కృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, మంగళవారం సాయంత్రం వరకు సినీ ప్రముఖుల సందర్శనార్థం కృష్ణ భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో ఉంచుతారు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. రేపు ఉదయం పద్మాలయా స్టుడియోస్‌కు తీసుకొని వస్తారు. అక్కడ శాస్త్రోక్తంగా చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ప్రభుత్వం లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వెల్లడించారు.




First Published:  15 Nov 2022 10:51 AM GMT
Next Story