Telugu Global
Telangana

కేసీఆర్‌.. అసెంబ్లీకి రా సామి, అన్ని లెక్కలు తేలుద్దాం

80 వేల పుసకాలు ఏం చదివినవో మాట్లాడుదాం. ఒక్కసారి రా సామి.. వస్తే రోజంతా చర్చ చేద్దామన్న సీఎం రేవంత్‌

కేసీఆర్‌.. అసెంబ్లీకి రా సామి, అన్ని లెక్కలు తేలుద్దాం
X

ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కేసీఆర్‌ మోసం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలోనే నిర్ణయించుకున్నాని చెప్పారు. పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అన్నారు. రంగనాయక్‌ సాగర్‌ పేరుతో హరీశ్‌ ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారని, భూసేకరణ కుట్ర కేసులో కేటీఆర్‌ ఊచలు లెక్కపెడుతారని, కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే అన్ని మాట్లాడుకుందామని రేవంత్‌ ఫైర్‌ అయ్యారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ... మిడ్‌ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం తెలిపారు.

మాట ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది

దేశానికి ప్రధానిని అందించిన గడ్డ కరీంనగర్‌. పరిపాలన ఎలా ఉంటుందో దేశానికి చూపిన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ఇక్కడి నుంచే ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో కరీంనగర్‌ బిడ్డ పొన్నం ప్రభాకర్‌, జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. మాట ఇస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందన్నారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పొన్నంను ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించారు. బండి సంజయ్‌ను రెండు సార్లు ఎంపీ చేస్తే కేంద్ర మంత్రి అయ్యారు కానీ కరీంనగర్‌కు జిల్లాకు చిల్లి గవ్వా అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌ అభివృద్ధి కోసం ఎప్పుడైనా పార్లమెంటులో మాట్లాడారా? అంతకు ముందు మూడుసార్లు బీఆర్‌ఎస్‌ ఎంపీలను (కేసీఆర్‌, వినోద్‌కుమార్‌ )గెలిపిస్తే వాళ్లూ కరీంనగర్‌కు చేసిందేమీ లేదన్నారు.

మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందున్నది

పదేళ్లు పాలన చేసిన వాళ్లు ఒక్కటన్నా అక్కరక్కొచ్చే మాట మాట్లాడుతున్నారా? పదేళ్లు ఏం చేయలేని వాళ్లు మేము అధికారంలోకి రాగానే పది నెలల్లో దిగిపోవాలని అంటున్నారు. మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్‌ విసిరారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు. 50 వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా ఎల్బీ స్టేడియం వేదికగా క్షమాపణ చెబుతాను. రూ. 11 వేల కోట్ల రుణమాఫీకి కేసీఆర్‌ ఐదేళ్లు తీసుకున్నారు. 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. రుణమాఫీని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? అని మండిపడ్డారు. మీరు చేసిన రుణమాఫీ.. మేము చేసిన రుణమాఫీ వివరాలు బైటికి తీసి చర్చకు పెడుదాం. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు తీసి చూపిస్తాం. పదేళ్లలో మీరు చేయలేని పని మేం చేస్తుంటే మీకు నొప్పి ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది. త్వరలోనే పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంగతి తేలుస్తామన్నారు.

కేటీఆర్‌ ఉరుకులాటలు గమనిస్తూనే ఉన్నా

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాదిలో తెలంగాణలో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండించారు. అది మా గొప్పతనం కాదా? రూ. 1.83 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల కోసం కేసీఆర్‌ ఖర్చు చేశారు. ఆ దిక్కుమాలిన వాడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కుప్పకాలాయి. మా హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. ఏ ప్రాజెక్టు అయినా పూర్తి చేశావా? ప్రజలకు అంకితం చేశావా? అని ప్రశ్నించారు.రంగనాయకసాగర్‌ వద్ద హరీశ్‌రావు ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారు. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీశ్‌ పేరు మీదకు రాయించుకున్నారు. భూ బదలాయింపులపై హరీశ్‌ లెక్క చెప్పాలి. అన్ని లెక్కలు తీయిస్తున్నాం. కొండపోచమ్మ నుంచి కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు కాల్వ ద్వారా నేరుగా నీళ్లు వెళ్తున్నాయి. ప్రజలు అధికారం ఇస్తే ఇదేనా మీరు చేసింది? డ్రగ్స్‌ తీసుకున్న వాళ్లు ఇంట్లో దొరికితే కేసు పెట్టకూడదా? తాగి తందనాలు ఆడితే కేటీఆర్‌ ఎలా సమర్థిస్తారు? విదేశీ మద్యంతో దొరికితే కేసు పెట్టకూడదా? చట్టం అందరికీ సమానమే కేటీఆర్‌ అని చురకలు అంటించారు. కేటీఆర్‌ ఉరుకులాటలు గమనిస్తూనే ఉన్నా.. ఎంత దూరం ఉరుకుతారో నేనూ చూస్తాను. భూసేకరణపై కుట్ర చేసినందుకు కేటీఆర్‌ ఊచలు లెక్క పెడుతారు. నా నియోజకవర్గంపై కేసీఆరకు ఎందుకంత కక్ష ? అని ప్రశ్నించారు. తానేమీ లక్ష ఎకరాలు సేకరించలేదని నాలుగు గ్రామాల్లో 1100 ఎకరాలే సేకరిస్తున్నామన్నారు. ఇది ప్రపంచ సమస్యల అయిందా? అని ప్రశ్నించారు.

భూసేకరణ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదా?

పరిశ్రమలు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భూసేకరణ చేస్తున్నాం. భూసేకరణకు అధికారులు వస్తే దాడి చేస్తారా? భూసేకరణ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదా? పరిశ్రమలు తెచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకూడదా? బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు భూములు సేకరించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. భూసేకరణ జరగాల్సిందేనని, అభివృద్ధి కోసం ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. భూమి కోల్పోతున్న వారికి మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. చివరగా కేసీఆర్‌కు ఒక్కటే చెబుతున్నా.. అసెంబ్లీకి రా సామి. 80 వేల పుసకాలు ఏం చదివినవో మాట్లాడుదాం. ఒక్కసారి రా సామి.. వస్తే రోజంతా చర్చ చేద్దాం. అన్ని లెక్కలు తేలుద్దామనిని సీఎం సవాల్‌ విసిరారు.

First Published:  20 Nov 2024 5:08 PM IST
Next Story