Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు వేడుకలు..

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దేనని అన్నారు కేసీఆర్.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది ముగింపు వేడుకలు..
X

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. జూన్-1, 2, 3 తేదీల్లో మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించాలని ఆయన చెప్పారు. ఈ మేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ ఒకటో తేదీ సాయంత్రం 7 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. అమర వీరులకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన నివాళి అర్పిస్తాయి.


ఇక జూన్-2 దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహిస్తారు. కేసీఆర్ అధ్యక్షతన సభ జరుగుతుంది. అదే రోజు హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ శ్రేణులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేస్తాయి. జూన్-3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాను, జాతీయ జెండాను ఆవిష్కరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్.

తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దేనని అన్నారు కేసీఆర్. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని, విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

First Published:  27 May 2024 9:19 PM IST
Next Story