కేసీఆర్, భగవంత్ మన్.. చర్చల సారాంశం ఏంటి..?
కేసీఆర్, భగవంత్ మన్ దేని గురించి చర్చించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..?
తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ ఈరోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సమావేశం పూర్తయిన తర్వాత చర్చల సారాంశం ఏంటనేది అధికారికంగా బయటకు రాలేదు. అటు బీఆర్ఎస్ తరపున కూడా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. భగవంత్ మన్ కూడా మీడియాతో మాట్లాడలేదు. ఇంతకీ వీరిద్దరూ దేని గురించి చర్చించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..?
జాతీయ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నప్పటి నుంచి కేసీఆర్ తో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సన్నిహితంగా ఉంటున్నారు. పంజాబ్ లో రైతు కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన సందర్భంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చింది, ఆ సాయాన్ని స్వాగతించింది. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మన్, హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రస్థానంపైనే వీరిద్దరి మధ్య ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాలతోపాటు, రైతు సమస్యలపై కూడా వారు చర్చించినట్టు సమాచారం.
Punjab Chief Minister Sri @BhagwantMann called on Chief Minister Sri KCR in Pragathi Bhavan, Hyderabad today
— BRS Party (@BRSparty) December 20, 2022
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో భేటీ అయిన పంజాబ్ సీఎం శ్రీ భగవంత్ మాన్. pic.twitter.com/TrmvMiTLDj
బంధం మరింత బలపడేలా..
ఆప్, బీఆర్ఎస్ బంధం ముందు ముందు మరింత బలపడేలా కనిపిస్తోంది. పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు వస్తారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్ జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కీలక నేతలు కూడా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ని కలిసే అవకాశముంది. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. భావసారూప్య పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీల మద్దతుతో అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కి బలమైన పునాదులు ఏర్పాటు చేయబోతున్నారు. బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆప్ నుంచి వస్తున్న మద్దతుతో బీజేపీ కడుపు రగిలిపోతోందని చెప్పాలి.