Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్.. రెండిటికీ కేసీఆర్ చాకిరేవు

కేసీఆర్ తో చేతులు కలిపిన జాతీయ నాయకులు, బీఆర్ఎస్ తో చెలిమి కోరుకుంటున్న నాయకులంతా బీజేపీ, కాంగ్రెస్ ని సమదూరం పెట్టినవారే. వారే ఇప్పుడు ఖమ్మం సభకు హాజరయ్యారు.

బీజేపీ, కాంగ్రెస్.. రెండిటికీ కేసీఆర్ చాకిరేవు
X

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించిందనే విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు జాతీయ యవనికపై పోరాటాన్ని మొదలు పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఒకేచోట కేంద్రీకరించడం బీఆర్ఎస్ కి అత్యవసరం. అంతమాత్రాన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో బీఆర్ఎస్ చేరుతుందని అంచనా వేయలేం. అలాగని కాంగ్రెస్ ని దూరం పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఏకపక్షంగా పోరాడుతుందనీ అనుకోలేం. ఇలాంటి అనుమానాలన్నిటినీ ఖమ్మం సభలో పటాపంచలు చేసారు కేసీఆర్. తొలిసారిగా ఆయన కాంగ్రెస్ పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీయే కారణం అని అన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందని, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ ను తిడుతుందని చెప్పారు. కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ ను తయారు చేస్తామన్నారాయన. దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతోపాటు, రైతు బంధు స్కీమ్‌ దేశమంతా అమలు చేస్తామన్నారు.


జలవనరులు, సాగు భూమి విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశమని అన్నారు కేసీఆర్. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే మనం వాడుకుంటున్నామని చెప్పారు. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోందని అన్నారు. దీనికి కారణం గత ప్రభుత్వాలు కాదా అని ప్రశ్నించారు. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉందని, కానీ మన దేశంలో అంత పెద్ద రిజర్వాయర్ ఒక్కటీ లేదన్నారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కెనడా నుంచి కందిపప్పు, విదేశాలనుంచి లక్ష కోట్ల రూపాయల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. వీటన్నిటికీ గత ప్రభుత్వాలే కారణం అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4.10లక్షల మెగావాట్లు కాగా, ఎప్పుడూ 2.10లక్షల కోట్ల మెగావాట్లు మించి మనం వాడుకోలేకపోతున్నామని చెప్పారు.

కేసీఆర్ తో చేతులు కలిపిన జాతీయ నాయకులు, బీఆర్ఎస్ తో చెలిమికోరుకుంటున్న నాయకులంతా బీజేపీ, కాంగ్రెస్ ని సమదూరం పెట్టినవారే. వారే ఇప్పుడు ఖమ్మం సభకు హాజరయ్యారు. భారత్ జోడో యాత్రకు ఆహ్వానం ఉన్నా కూడా అఖిలేష్ యాదవ్ హాజరు కాలేదు. కేరళలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్ అంటే పడదు. అదే సమయంలో ఆయా పార్టీలన్నిటీకీ బీజేపీపై కూడా కక్ష ఉంది. అందుకే వీరంతా ఒకేగూటికి చేరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీకి సమ దూరం పాటించాలనుకుంటున్నారు. ఖమ్మం సభలో బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శల ఎక్కు పెట్టిన కేసీఆర్.. తాము ఎవరికీ దగ్గర కాదని, దేశాన్ని అధోగతి పాలుచేసిన పాలకులు, పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు.

First Published:  18 Jan 2023 6:18 PM IST
Next Story