Telugu Global
Telangana

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్‌

మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. దాదాపు 5 నెలలుగా తిహార్‌ జైలులో ఉన్నారు కవిత.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్‌
X

ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్‌ రిలీఫ్‌ లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ నమోదు చేసిన కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కవిత బెయిల్‌కు సంబంధించి దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

సీబీఐ కేసులో 4 నెలలుగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో 5 నెలలుగా కవిత జైలులో ఉన్నారని వాదనలు వినిపించారు రోహత్గీ. లిక్కర్ పాలసీ కేసులో వంద కోట్ల లావాదేవీలు జరిగాయనేది కూడా ప్రచారం మాత్రమేనని వాదించారు. మ‌రోవైపు లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు.

మార్చి 15న కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. దాదాపు 5 నెలలుగా తిహార్‌ జైలులో ఉన్నారు కవిత. గతంలో నాలుగు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ నిరాశే ఎదురైంది. చివరకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్‌ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీలక నేతలు కేటీఆర్, హరీష్‌ రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారు.

First Published:  27 Aug 2024 7:51 AM GMT
Next Story