Telugu Global
Telangana

అదానీపై మౌనం ఎందుకు..? దర్యాప్తు చేపట్టండి –ఎమ్మెల్సీ కవిత

ప్రధాని మోదీ మద్దతుతోనే అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసని అన్నారు కవిత. అదానీ వ్యవహారంపై ఎవరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నాయని.. ఇదంతా ఎవరిని నమ్మించడానికని ప్రశ్నించారు.

అదానీపై మౌనం ఎందుకు..? దర్యాప్తు చేపట్టండి –ఎమ్మెల్సీ కవిత
X

అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు ఎమ్మెల్సీ కవిత. వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిస్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(JPC)ని ఏర్పాటు చేయాలని అన్నారు.

రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరయితే అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంత తేలిగ్గా ఎలా చెబుతారని నిలదీశారు కవిత. ఏ ప్రభుత్వం మద్ధతుతో ఆదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ముందుకొచ్చి ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్లు గత నెల 23వ తేదీ నుంచి భారీగాపడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.

ప్రధాని మోదీ మద్దతుతోనే అదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసని అన్నారు కవిత. అదానీ వ్యవహారంపై ఎవరు ప్రశ్నించినా అంతా బాగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వు బ్యాంకు చెబుతున్నాయని.. ఇదంతా ఎవరిని నమ్మించడానికని ప్రశ్నించారు.

కేంద్రంలోని మోదీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపరిచితే, తెలంగాణలో కేసీఆర్ బడ్జెట్ మాత్రం దేశానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు కవిత. రూ. 2.9 లక్షల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమన్నారు. దేశానికి స్పూర్తిగా నిలిచే అంశాలు ఈ బడ్జెట్లో ఎన్నో ఉన్నాయని వివరించారు. దామాషా ప్రకారం బడ్జెట్ ను కేటాయించామని, సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగమించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను విస్మరించిందని విమర్శించారు. దేశంలో లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల్లో కేంద్రం కోత విధించిందని, తక్షణమే ఆ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు.

First Published:  6 Feb 2023 4:42 PM IST
Next Story