నీలం మధును గెలవనివ్వ.. కాటా శపథం!
తన ఓటమికి కారణం అయిన నీలం మధుపై కాటా గుర్రుగా ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా కాంగ్రెస్ పార్టీ నీలం మధుని పిలిచి మరీ మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో అధిష్టానం నిర్ణయంపై కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ ఎన్నికల వేళ పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్‌గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్న నీలం మధు మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యతిరేకంగా నీలం మధు బీఎస్పీ నుంచి పోటీ చేశారు. దీంతో తన ఓటమికి కారణం అయిన నీలం మధుపై కాటా గుర్రుగా ఉన్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా కాంగ్రెస్ పార్టీ నీలం మధుని పిలిచి మరీ మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో అధిష్టానం నిర్ణయంపై కాటా శ్రీనివాస్‌గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన ఓటమికి కారణమైన నీలం మధుకి టికెట్ ఎలా ఇస్తారు అని హై కమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్.
ఈ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ గౌడ్‌తో సఖ్యత కోసం నీలం మధు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. కాటాను కలవడానికి నీలం మధు ఎన్ని ఫోన్లు చేసిన ఆయన ఎత్తడం లేదని సమాచారం. ఇంటికి వెళ్లినా కలవడం లేదని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనే ముందుగా తనకు టికెట్ ఇవ్వకుండా నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై కాటా అనుచరులు భగ్గుమన్నారు. కాటా అభిమానుల ఆందోళనలతో రాత్రికి రాత్రి పటాన్‌చెరు రణరంగంగా మారింది. దీంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ అధిష్టానం.. నీలంకు క్యాన్సిల్ చేసి కాటా శ్రీనివాస్‌గౌడ్‌కే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ నేపథ్యంలో నీలం మధును పిలిచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడాన్ని కాటా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన గెలుపు కోసం పనిచేసే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు.