బీఆర్ఎస్‌లోకి కాసాని జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి!
ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం.
ముదిరాజు సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్, బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం.
ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముదిరాజు సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంపై అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. దీంతో బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన అంబర్‌పేట శంకర్, ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇక ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నేతగా పేరున్న కాసాని జ్ఞానేశ్వర్ సైతం బీఆర్ఎస్ గూటికి చేరతారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయడం లేదని లోకేశ్ పేరిట లేఖ విడుదల కావడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాసానితో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో చేరికకు కాసాని సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్‌లో చేరబోతున్న అంశాన్ని బిత్తిరి సత్తి సైతం ధృవీకరించారు. గురువారం ఆయన ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.