మా అభ్యర్థులను ట్రాప్ చేస్తున్నారు..!
తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు డీకే. తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారంలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం దాదాపుగా స్పష్టమైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు కూడా డీకే కనుసన్నల్లో నడుస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ.. తెలంగాణ పొలిటికల్ హడావిడిపై డీకే శివకుమార్ తాజాగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్ పై విమర్శలు..
ఫలితాలు రాకముందే డీకే శివకుమార్, బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు బీఆర్ఎస్ కీలక నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు డీకే. తమ అభ్యర్థులకు ఫోన్లు చేస్తున్నారని, వారితో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రలోభాలకు లొంగబోరని ధీమా వ్యక్తం చేశారు.
క్యాంపులు అవసరం లేదు..
పూర్తి మెజార్టీ వస్తే పర్లేదు, ఒకవేళ బొటాబొటి సీట్లు వస్తే కాంగ్రెస్ నేతల్ని పట్టుకోవడం కష్టం అని అధిష్టానం కూడా ఆలోచనలో పడింది. ఫలితాలు రాగానే తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలిస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ క్యాంపు రాజకీయాలు నడిపే బాధ్యత కర్నాటక డిప్యూటీ సీఎం డీకేకు అప్పగించారని అంటున్నారు. అయితే డీకే మాత్రం గెలిచినవారిని క్యాంపులకు తరలించే అవసరం లేదు అని చెప్పడం విశేషం. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారాయన. తమకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
♦