Telugu Global
Telangana

పెండింగ్‌లోనే కరీంనగర్‌ ఎంపీ సీటు.. మాజీ మంత్రితో కాంగ్రెస్‌ చర్చలు..?

ప్రధానంగా కరీంనగర్‌ స్థానంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులుగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినిపించినప్పటికీ.. బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ వెతుకుతున్నట్లు సమాచారం.

పెండింగ్‌లోనే కరీంనగర్‌ ఎంపీ సీటు.. మాజీ మంత్రితో కాంగ్రెస్‌ చర్చలు..?
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో డబుల్‌ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌.. ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేస్తుంది. ఇప్పటికే 14 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన హస్తం పార్టీ.. మరో మూడు స్థానాలు పెండింగ్‌లో ఉంచింది. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల్లో ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.

ప్రధానంగా కరీంనగర్‌ స్థానంపై స్పెషల్‌ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులుగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినిపించినప్పటికీ.. బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ వెతుకుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను పార్టీలోకి తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గంగుల కమలాకర్‌ను పార్టీలో చేర్చుకుంటే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు కీలకంగా ఉన్న కరీంనగర్‌ జిల్లాలో దెబ్బకొట్టినట్లవుతుందని కాంగ్రెస్‌ ప్లాన్. ప్రస్తుతం గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానంను పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకుని ఆయన కూతురు కావ్య‌కు వరంగల్ పార్లమెంట్ స్థానం కట్టబెట్టింది.

అయితే ఈ వార్తలను గంగుల కమలాకర్‌ కొట్టిపారేస్తున్నప్పటికీ.. ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఇదే అంశంపై మాట్లాడిన గంగుల.. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పోటీ ఇచ్చే అవకాశమే లేదన్నారు గంగుల. బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2014, 18, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. మంత్రిగానూ సేవలందించారు.

First Published:  8 April 2024 9:28 AM IST
Next Story