Telugu Global
Telangana

ప్రపంచం మెచ్చిన హైదరాబాదీ టేస్ట్ 'కరాచీ బిస్కెట్'

టేస్ట్ అట్లాస్-150 జాబితాలో దక్షిణ భారత్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ కరాచీ బేకరీ. మిగతా రుచులన్నీ ఉత్తర భారత్ కి చెందినవే.

ప్రపంచం మెచ్చిన హైదరాబాదీ టేస్ట్ కరాచీ బిస్కెట్
X

హైదరాబాద్ వచ్చినవారెవరైనా ఇక్కడ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. విశేషం ఏంటంటే.. బిర్యానీ తయారు చేసే బ్రాండ్ కంటే హైదరాబాద్ బిర్యానీ అనే పేరు బాగా ఫేమస్. ఉస్మానియా బిస్కెట్ కూడా జాతీయ స్థాయిలో హైదరాబాద్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇక కరాచీ బేకరీ మరోసారి హైదరాబాద్ కి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది. టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన 150 రుచికరమైన ఆహార పదార్థాల్లో కరాచి బిస్కెట్ చోటు దక్కించుకుంది.

టేస్ట్ అట్లాస్..

ఫుడ్ లవర్స్ కి పరిచయం అక్కర్లేని పేరు టేస్ట్ అట్లాస్. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, కొత్త రుచులను ప్రపంచ వ్యాప్తంగా అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది టేస్ట్ అట్లాస్. పురాతన రుచుల్ని కూడా వెదికి మరీ అందరికీ తెలిసేలా చేస్తుంది. ఇక టేస్ట్ అట్లాస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 150 ఆహార పదార్థాలను, వాటిని తయారు చేసే కంపెనీలతో ఓ లిస్ట్ తయారు చేసింది. ఆ లిస్ట్ లో హైదరాబాద్ కి చోటు దక్కేలా చేసింది కరాచీ బేకరీ.


భారత్ నుంచి 10 రకాల ఆహార పదార్థాలకు టేస్ట్ అట్లాస్-150లో చోటు దక్కింది. అందులో కరాచీ బేకరీ తయారు చేసే కరాచీ బిస్కెట్ కూడా ఉంది. పుణెలోని కయానీ బేకరీ 'మావా కేక్' అనే ప్రోడక్ట్ తో 18వ స్థానంలో నిలిచింది. కోల్ కతాలోని కేసీదాస్ కంపెనీ తయారు చేసే 'రసగుల్లా' 25వ స్థానం దక్కించుకుంది. కోల్ కతాలోని ఫ్లూరేస్ కంపెనీ తయారు చేసే 'రమ్ బాల్స్' 26వ స్థానంలో ఉన్నాయి. కరాచీ బిస్కెట్ ఫ్లేవర్ తో అందరికీ సుపరిచితనైన కరాచీ బేకరీ 29వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. టేస్ట్ అట్లాస్-150 జాబితాలో దక్షిణ భారత్ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక సంస్థ కరాచీ బేకరీ. మిగతా రుచులన్నీ ఉత్తర భారత్ కి చెందినవే.

హైదరాబాద్ లోని మొజాంజాహీ మార్కెట్ సమీపంలో 1953లో కరాచీ బేకరీ స్థాపించారు. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో కూడా ఈ సంస్థకు బ్రాంచ్ లు ఉన్నాయి. అమెరికా, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియా, మధ్య ఆసియా దేశాలకు కరాచీ బిస్కెట్ లు ఎగుమతి అవుతున్నాయి.


First Published:  15 Sept 2023 11:49 AM IST
Next Story