తెలంగాణ కంటి వెలుగు.. కోటిన్నర దాటిన పరీక్షలు
89 రోజుల పనిదినాలలో కోటి 58 లక్షల మందికి పైగా పరీక్షలు పూర్తి చేశారు. అనుకున్న లక్ష్యాన్ని మించి ఆ సంఖ్య 2కోట్లకు చేరుకునే దిశగా ఈ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది.
కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రజలకు ఓ వరంలా మారింది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా రెండో విడతలో 1,58,35,947 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి అందులో 22,21,494 మందికి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందించారు. 1.18 కోట్లమందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్థారించారు. వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు.
కంటి సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు, మరికొందరు అసలు సమస్య ఉన్నట్టు కూడా గుర్తించలేరు. ఆ సమస్య ముదిరిపోతే మరింత కష్టం. పేదరికం కారణంగా కొంతమంది వైద్య పరీక్షలకు కూడా దూరంగా ఉంటారు. అలాంటివారందరికీ వరదాయని తెలంగాణ కంటి వెలుగు. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
89 రోజుల పనిదినాలలో కోటి 58 లక్షల మందికి పైగా పరీక్షలు పూర్తి చేశారు. అనుకున్న లక్ష్యాన్ని మించి ఆ సంఖ్య 2కోట్లకు చేరుకునే దిశగా ఈ కార్యక్రమం వేగవంతంగా సాగుతోంది. జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే 89 పనిదినాలు పూర్తయ్యాయి. ఆయా జిల్లాల్లో కార్యక్రమం విజయవంతం చేసేందుకు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. మొదటి విడత 2018లో జరిగింది. అప్పట్లో 1.5 కోట్లమందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 50లక్షలమందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.