ఇక అన్ని వయసుల వారికి 'కంటి వెలుగు'.. డిసెంబర్‌లో రెండో దశ!
ఇకపై చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో రెండో దశ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొని వస్తోంది. పేదల కోసం ఆరోగ్యశ్రీని విజయవంతంగా కొనసాగించడమే కాకుండా.. కొన్ని పథకాలు కూడా అమలు చేస్తోంది. కొన్నాళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని నిర్వహించింది. వయసు పైబడిన వారికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేసింది. అంతే కాకుండా అవసరమైన వారికి సరోజిని దేవి, ఎల్వీ ప్రసాద్, పుష్ఫగిరి ఆసుపత్రుల్లో సర్జరీలు కూడా చేశారు. కాగా, ఇటీవల రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దాదాపు 23 శాతం విద్యార్థులు కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఇకపై చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్‌లో రెండో దశ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అవసరం అయితే తక్కువ ఖర్చుతో సర్జరీలు కూడా చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. వైద్యారోగ్య శాఖ అందుకు కావల్సిన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతీ డివిజన్, వార్డు, గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. స్క్రీనింగ్ చేసే సమయంలో ఓ డాక్టర్, ఆప్తమాలజీ అసిస్టెంట్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఓ టెక్నికల్ స్టాఫ్ ఉంటారు. స్థానిక బస్తీ దవాఖానా, పీహెచ్‌సీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పేషెంట్లకు పరీక్షలు చేస్తారు. హైదరాబాద్‌లో 36 శాతం, రంగారెడ్డి జిల్లాలో 18 శాతం, నాగర్ కర్నూల్‌లో 9 శాతం మంది పిల్లల్లో కంటి సమస్యలు ఉన్నాయి.
అందుకే ఈ సారి కంటి వెలుగు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్యాంపులు నిర్వహించనున్నారు. ఇటీవల పిల్లలు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడుతుండటంతో కంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అందుకే ఆయా పాఠశాలల్లో పరీక్షలతో పాటు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు.