Telugu Global
Telangana

కంటివెలుగు 100 డేస్ సెలబ్రేషన్స్..

ఇప్పటి వరకు మొత్తం 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయిందని.. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు.

కంటివెలుగు 100 డేస్ సెలబ్రేషన్స్..
X

కంటి వెలుగు కార్యక్రమం రెండో విడత విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆయన సహచర మంత్రులతో కలసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికగా కంటి వెలుగు సక్సెస్ అయిందని అన్నారాయన. 1.61 కోట్ల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయని, 40.59 లక్షల మంది దృష్టి లోపం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్యం, కళ్లజోళ్లు అందించామని తెలిపారు. 22.51 లక్షల రీడింగ్ గ్లాసులు, 18.08 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసులు పంపిణీ చేశామన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కూడిన నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు. ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిని హరీష్ రావు అభినందించారు. అందరం కలిసి ఆరోగ్యతెలంగాణ సాధిస్తామన్నారు.


కంటి వెలుగు తొలిదశ విజయవంతమైంది, మలి దశను జనవరి 18నుంచి మొదలు పెట్టారు. రెండో దశలో కూడా లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేశారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి.. ఉచితంగా పరీక్షలు నిర్వహించి.. అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదని అన్నారు మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు మొత్తం 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయిందని.. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదనే ఉద్దశంతో కంటి వెలుగు పథకం తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని ఆయన చెప్పేవారు. ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాలవారు, పేదలు ఇష్టపడకపోవచ్చు. అందుకే ఆస్పత్రినే వారి వద్దకు తెచ్చే రూపంలో క్యాంప్ లు ఏర్పాటు చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చర్యలు తీసుకున్నారు.

First Published:  18 Jun 2023 6:54 AM IST
Next Story