కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు..
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, బీఆర్ఎస్ సర్కారు రైతులకు అన్యాయం చేయదని స్పష్టం చేశారు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదారి పట్టించాయని అన్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతంతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ వివాదానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. రేపు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ముసాయిదా రద్దు చేస్తున్నట్లు డీటీసీపీ అధికారులు ప్రకటించారు.
కౌన్సిలర్ల వరుస రాజీనామాలు, రైతుల ఆందోళనలతో ప్రభుత్వం ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 2700 ఎకరాల ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ లోకి వ్యవసాయ భూములు వెళ్తున్నాయని అన్నదాతలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పంటలు పండే భూములు ఇండస్ట్రియల్ జోన్ లోకి వెళ్లడం తమకు ఇష్టం లేదని రైతులు చెబుతున్నారు. అయితే అది కేవలం ముసాయిదా మాత్రమేనని ప్రభుత్వం సర్దిచెబుతూ వచ్చింది. కానీ ప్రతిపక్షాల రాద్ధాంతంతో రైతుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రైతుల సంక్షేమమే కేసీఆర్ సర్కారు లక్ష్యం..
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, బీఆర్ఎస్ సర్కారు రైతులకు అన్యాయం చేయదని స్పష్టం చేశారు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి. ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదారి పట్టించాయని అన్నారు. మార్చ్ 27, 2021న తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తీర్మానం రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అన్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే డ్రాఫ్టు ప్లాన్ బయట పెట్టేవాళ్లం కాదు కదా అని ప్రశ్నించారామె. ఈ విషయంలో తమకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారామె. రైతులకు ఒక్క గుంట భూమి విషయంలో కూడా అన్యాయం జరగదని హామీ ఇచ్చారామె. రైతులు ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. రెసిడెన్షియల్ జోన్లు ఇండస్ట్రియల్ జోన్లుగా మారడంపై మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ రమేష్ పై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారామె.