Telugu Global
Telangana

కవితకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం బాధ్యతలు?

ఢిల్లీ కేంద్ర కార్యాలయ బాధ్యతలే కాకుండా.. అన్ని పార్టీలతో సమన్వయం చేసుకునే జాతీయ కోఆర్డినేటర్ అనే కీలక పదవి ఆమెకే కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

కవితకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం బాధ్యతలు?
X

బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బీఆర్ఎస్‌కు సంబంధించిన కీలకమైన విషయాలపై ఆయన కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చిస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి జాతీయ స్థాయిలో తీసుకోవల్సిన చర్యలను ఆయన పూర్తి చేస్తున్నారు. ఉపఎన్నిక ముగిసిన తర్వాత పూర్తి సమయం బీఆర్ఎస్‌కు కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో చేపట్టవలసిన పనులకు సంబంధించిన ఓ బృందాన్ని ఆయన రెడీ చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు, తటస్థ పార్టీలతో ముందుగా సంప్రదింపులు జరుపనున్నారు. అలాగే రైతు, కార్మిక సంఘాల ఏర్పాటుకు కూడా చురుకుగా కసరత్తు జరుగుతోంది. కాగా, ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌కు సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఢిల్లీ కేంద్ర కార్యాలయ బాధ్యతలే కాకుండా.. అన్ని పార్టీలతో సమన్వయం చేసుకునే జాతీయ కోఆర్డినేటర్ అనే కీలక పదవి ఆమెకే కట్టబెట్టనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఢిల్లీలో వ్యవహారాలను కనిమొళి చూసే వారు. కరుణానిధి ఆ కీలకమైన బాధ్యతలు కనిమొళికే అప్పగించారు. డీఎంకే ఎంపీగా ఉన్న కనిమొళి పార్లమెంటులో కూడా తమిళనాడు వాయిస్ వినిపించే వారు. అదే సమయంలో ఇతర పార్టీల నాయకులతో సమన్వయం చేసుకుంటూ వెళ్లేవారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనిమొళికి మంచి మైలేజీ కూడా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే బాటలో వెళ్లాలని భావిస్తున్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన పూర్తిగా తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. అలాగే కవిత పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 2024లో మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేయడమో లేదంటే రాజ్యసభకు నామినేట్ కావడం ద్వారా ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇకపై ఆమె పూర్తిగా ఢిల్లీ వ్యవహారాలను చూస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో కీలకమైన బాధ్యతలు సొంత వ్యక్తులు చూస్తేనే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. సంతోశ్ కుమార్ కంటే కవితనే ఇందుకు సరైన ఛాయిస్ అని కూడా ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో కవిత కూడా వెంట ఉంటున్నారు. ఇప్పటికే ఎంపీగా పని చేసిన అనుభవం ఉన్న కవితకు.. జాతీయ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. గత పరిచయాల దృష్ట్యా ఆమె జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలతో సమన్వయం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆమె.. జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే.. మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో కూడా భేటీ అవుతున్నారు. కవిత సిఫారసు తోనే సీనియర్ జర్నలిస్టు సంజయ్ కుమార్ ఝాను ఢిల్లీలో పీఆర్వోగా నియమించినట్లు తెలుస్తున్నది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కవితకే ఢిల్లీ బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తున్నది.

First Published:  14 Oct 2022 7:03 AM IST
Next Story