Telugu Global
Telangana

405 కిలోమీటర్ల జల జైత్రయాత్ర.. కాళేశ్వరం ఘన చరిత్ర

ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని జల జైత్రయాత్రగా చెబుతున్నారు తెలంగాణ ప్రజలు. 2019లో తొలిసారి రావి చెరువుకి చేరుకున్న మేడిగడ్డ జలాలు.. వరుసగా ఐదో ఏడాది కూడా తరలి వచ్చాయి. స్థానిక రైతులకు సంతోషాన్నిచ్చాయి.

405 కిలోమీటర్ల జల జైత్రయాత్ర.. కాళేశ్వరం ఘన చరిత్ర
X

నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మిస్తే ఆ జిల్లాతోపాటు చుట్టుపక్కల మరికొన్ని జిల్లాలు సస్యశ్యామలం అవుతాయనేది నిజం. కానీ ఎక్కడో ప్రాజెక్ట్ నిర్మిస్తే, 405 కిలోమీటర్ల దూరంలో ఇంకెక్కడో ఉన్న ఊరికి కూడా దాని ఫలాలు అందాయంటే ఆ ప్రాజెక్ట్ సార్థకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం కేసీఆర్ ముందుచూపే దానికి కారణం అంటున్నారు రైతులు. 50ఏళ్లపాటు వట్టిపోయిన చెరువులు కూడా నేడు జలసిరిని సంతరించుకోవడం కాళేశ్వరం ఘనత అని చెబుతున్నారు.

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజ్ ఉంది..

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో రావిచెరువు ఉంది..

మధ్యలో దూరం 405.45 కిలోమీటర్లు..

కానీ మేడిగడ్డ నీరు రావి చెరువుకి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని జల జైత్రయాత్రగా చెబుతున్నారు తెలంగాణ ప్రజలు. 2019లో తొలిసారి రావి చెరువుకి చేరుకున్న మేడిగడ్డ జలాలు.. వరుసగా ఐదో ఏడాది కూడా తరలి వచ్చాయి. స్థానిక రైతులకు సంతోషాన్నిచ్చాయి.

50ఏళ్లుగా నీళ్లు లేక వట్టిపోయిన రావి చెరువు ఐదేళ్లుగా మేడిగడ్డ జలాలతో నిండుతోంది. దీంతో చెరువు కింద ఉన్న 250 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. పక్కనున్న ఆరు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు, బావుల్లో నీళ్లు పెరిగి మరో 200 ఎకరాలకు పైగానే సాగు చేస్తున్నారు రైతులు. సీఎం కేసీఆర్‌ ఆశయం మేరకు చివరి చెరువు నిండిందని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వానాకాలం వస్తే తప్ప ఇక్కడి రైతులకు నీటిజాడ తెలియదు. చెెరువులున్నా నిండే మార్గం లేదు. అలాంటిది మేడిగడ్డతో తమ చెరువులు నిండుతాయని ప్రభుత్వం చెబితే అప్పుడు నమ్మలేదు. గత పాలకులు ప్రగల్భాలు పలికి మోసం చేసిన ఉదాహరణలు కోకొల్లలు. అందుకే సూర్యాపేట ప్రజలు కాళేశ్వరం జలాలపై నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఏటా క్రమం తప్పకుండా మేడిగడ్డ జలాలతో రావి చెరువు నిండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మధ్యలో గెయిల్, హెచ్పీసీఎల్ పైపులైన్లు అడ్డు వచ్చినా కూడా వాటిని తప్పించి కేంద్రం నుంచి అనుమతులు సాధించి మరీ రావి చెరువుని కాళేశ్వరం జలాలతో నింపింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈ సుదీర్ఘ ప్రయాణం జల జైత్రయాత్రగా నిలిచిపోయింది.

First Published:  15 Aug 2023 12:27 PM IST
Next Story