Telugu Global
Telangana

లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలింది

కొత్త ఇంజనీర్లకు ఆ ప్రాజెక్టు ఒక మోడల్‌ స్టడీ కావాలే : సీఎం రేవంత్‌ రెడ్డి

లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కూలింది
X

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను లక్ష కోట్లు పెట్టి కడితే కూలిపోయిందని.. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. జలసౌధ ఆవరణలో గురువారం సాయంత్రం ఏఈఈలకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కాళేశ్వరం తప్పులకు అధికారులను బాధ్యులను చేయాలా.. రాజకీయ నాయకులను చేయాలా అని ప్రశ్నించారు. కొత్త ఇంజనీర్ల మోడల్‌ స్టడీకి కాళేశ్వరం సరైన ఉదాహరణ అన్నారు. కాళేశ్వరం తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే అసలు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంటే ఉందన్నారు. చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాళేశ్వరం లోపాలను ఒకరిపై ఒకరు వేస్తున్నారని, ఇది సరికాదన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు నుంచి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలు అమలు చేయకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. యువ ఇంజనీర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేదని, భవిష్యత్‌ లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావొద్దన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమని, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కష్టపడి పని చేయాలన్నారు. రికమండేషన్‌ తో వచ్చే వారికి దూర ప్రాంతాల్లో పోస్టింగ్‌ ఇచ్చి పనిష్మెంట్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పని మీద దృష్టి పెట్టాలే తప్ప పోస్టింగ్‌ ల మీద కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోందని.. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం అన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని, వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వాళ్లే రాణిస్తారని అన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారని, తాను జెడ్పీటీసీ సభ్యుడి నుంచే సీఎం స్థాయికి వచ్చానని తెలిపారు.

First Published:  26 Sept 2024 8:00 PM IST
Next Story